ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోటలే పర్యాటకులకు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కేవలం ఇక్కడి వంటకాలను టేస్ట్ చేయడమే లక్ష్యంగా విదేశాల నుండి సైతం పర్యాటకులు క్యూ కడుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. మన బిర్యానీ, ఇరానీ చాయ్ వీడియోలే ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. ఇది హైదరాబాద్ పర్యాటక రంగంలో వస్తున్న ఒక సరికొత్త మార్పుకు సంకేతం. హైదరాబాద్‌ను ఇప్పుడు ప్రపంచం వంటకాల రాజధానిగా గుర్తిస్తోంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు చారిత్రక కట్టడాల కంటే పాతబస్తీ గల్లీల్లో దొరికే రుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వీరిని ఫుడ్ టూరిస్టులు అని పిలుస్తున్నారు. మన వంటకాల గొప్పదనానికి గుర్తుగా 2019లోనే హైదరాబాద్‌కు యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ హోదా లభించడం, ఈ పాకశాస్త్ర వైభవాన్ని ప్రపంచ పటంలో మరింత బలోపేతం చేసింది.
బిర్యానీ కోసం ఎంత దూరమైనా.. ఎంత ఖర్చైనా
మన బిర్యానీకి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు.. ‘‘నేను కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్ వచ్చాను’’ అంటూ విదేశీయులు వీడియోలు చేస్తున్నారు. డైలీ మాక్స్ వంటి వారి వీడియోలకు ఏకంగా 50 లక్షలకు పైగా వ్యూస్ వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక చెఫ్, హైదరాబాద్‌లో బిర్యానీ ప్యాకెట్లు కొని వాటిని విమానంలో తీసుకెళ్లడానికి అదనంగా రూ.4,200 లగేజీ ఛార్జీ కట్టారు. అంటే ఒక్కో బిర్యానీ కోసం ఆయన దాదాపు రూ.9,000 ఖర్చు చేసినట్లయింది. దీన్ని బట్టి మన హైదరాబాద్ బిర్యానీ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.,
సెలబ్రిటీల సైతం ఫిదా..
కేవలం తిండి ప్రియులే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా హైదరాబాద్ రుచులకు దాసోహమంటున్నారు. దుబాయ్‌కి చెందిన ఖాలిద్ అల్ అమెరి అనే ప్రముఖ క్రియేటర్.. ఇండియాలోనే బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి 72 గంటల పాటు నగరంలోనే గడిపారు. చార్మినార్ రంజాన్ వేడుకలు, ఇక్కడి ఆచారాలను తన డిజిటల్ కెమెరాలో బంధించారు. ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తెల్లవారుజామునే హోటళ్లకు వెళ్లి పాయా, నహారీ వంటి వంటకాలను రుచి చూస్తూ ప్రపంచానికి మన రుచులను పరిచయం చేస్తున్నారు.