Headlines

చెల్లిని కాపాడేందుకు వెళ్లి అన్న మృతి.. ఒక రోజు తర్వాత ఊహించని సీన్.. అసలేం జరిగిదంటే?


వాగులో దూకి ఆత్మహత్యకు యత్నించిన చెల్లిని కాపాడబోయి అన్న ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన ఆలె లక్ష్మి, గంగాధర్‌ దంపతులకు గణేశ్, లయ అనే పిల్లలు ఉన్నారు. గణేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా, లయ ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. అయితే బంధువుల శుభకార్యం ఉండడంతో గణేశ్ జన్నేపల్లికి వచ్చాడు.

బుధవారం సాయంత్రం గణేశ్‌, అతని సోదరి లయ మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన లయ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఇంటి సమీపంలోని వాగు దగ్గరకు వెళ్లి అందులోకి దూకేసింది. అప్పటికే చెల్లి వెనకాలే వచ్చిన అన్న.. ఆమె వాగులో దూకడం గమనించి కాపాడేందుకు వెంటనే అతను కూడా నీటిలోకి దూకేశాడు. కానీ ఈత రాకపోవడంతో అతను నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గణేశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుడు వాగులో దూకిన లయ ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె కూడా చనిపోయి ఉంటుందని స్థానికులు భావించారు. కానీ మరుసటి రోజు ఉదయం, అన్నయ్య చనిపోయిన వాగు వద్ద లయ ఏడుస్తూ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమెను ప్రేతాత్మగా భావించి ఎవరూ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు.

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆమె దూకిన ప్రాంతంలో నీరు తక్కువగా ఉండడం వల్లే ప్రాణాలతో బయటపడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, విస్మయాన్ని నింపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *