Headlines

సీఎస్కే కోచ్‌గా జహీర్ ఖాన్‌నే ఎందుకు.. తెర వెనుక చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ అతడేనా?


ఐపీఎల్ 2027 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ (Zaheer Khan) నియమితుడైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టుతో అనుబంధం ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత ఈ మార్పు చోటు చేసుకుంది. జహీర్ ఎంపిక వెనుక అతడి ఆటగాడిగా ఉన్న అనుభవంతో పాటు కోచ్‌గా, క్రికెట్ నిర్వహణలో సాధించిన అనుభవాన్ని సీఎస్కే పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా యువ భారత ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అతడికి ఉన్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం భావించింది. 48 ఏళ్ల జహీర్‌కు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లతో పనిచేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ కారణాలతోనే కొత్త బాధ్యత అప్పగించినట్లు స్పష్టమవుతోంది.

సీఎస్కే యజమాని రూపా గురునాథ్ జహీర్ ఎంపికపై స్పందిస్తూ, అతడి ఆటగాడి ప్రస్థానం, యువ ప్రతిభను గుర్తించడంలో సామర్థ్యం జట్టుకు విలువైనదని పేర్కొన్నారు. అతడి మార్గదర్శకత్వంతో సీఎస్కే ప్రధాన బలాన్ని మరింత పటిష్ఠం చేసుకోవచ్చన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

జహీర్ నియామకంలో మాజీ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సూచన కీలకంగా మారినట్లు మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం, జహీర్ పేరును ధోనీ సూచించగా, క్రికెట్ మేనేజ్‌మెంట్ బృందం ఆ ప్రతిపాదనను పరిశీలించింది. రూపా గురునాథ్, రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కలిసి జహీర్ ఈ పాత్రకు సరిపోతాడని అంగీకరించినట్లు వెల్లడైంది.

జహీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పనిచేసిన అనుభవం కొత్తది కాదు. 2018లో ముంబై ఇండియన్స్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2022లో గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా పదోన్నతి పొందాడు. ఆ సమయంలో 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ముంబై జట్టు కోచింగ్ బృందంతో కలిసి పనిచేశాడు.

2024 మధ్యకాలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటార్‌గా చేరిన జహీర్ 2025 చివరి వరకు ఆ బాధ్యతలో కొనసాగాడు. జట్టు స్కౌటింగ్, వ్యూహరచనలోనూ అతడి పాత్ర ఉంది. 2017లో భారత జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు. రవి శాస్త్రి జాతీయ కోచ్‌గా ఉన్న సమయంలో ఈ బాధ్యతలు నిర్వర్తించాడు.

ఆటగాడిగా జహీర్ ఖాన్‌కు ధోనీతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2011 వన్డే ప్రపంచకప్‌ను ధోనీ నాయకత్వంలోని భారత జట్టు గెలిచినప్పుడు జహీర్ కూడా ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అదే మాజీ సహచరుడి సూచనతో సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఆసక్తికర పరిణామంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *