Headlines

వెస్ట్ ఆసియా యుద్ధం ప్రభావం ప్రపంచంలో ప్రతి ఒక్కరిపై!

వెస్ట్ ఆసియా యుద్ధం ప్రభావం ప్రపంచంలో ప్రతి ఒక్కరిపై!


తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఈనీతి అమెరికా, ఇరాన్‌లకు తెలియవా..తెలుసు కానీ తగ్గరు. తగ్గితే, ఇంకా తగ్గింపబడతారన్న భయంతో తగ్గేదేలే అంటూ హెచ్చులకు పోతూ తమను తాము మోసగించుకోవడమే కాకుండా, ప్రపంచదేశాలనూ ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. యుద్ధంలేదు కానీ యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం.రాబోయేరోజులు ఎలా మారతాయో తెలుసా.

ఇందుమూలంగా.. యావన్మంది భారతప్రజలకు తెలియజేయడమేమనగా.. జేబులు ఎంత గట్టిగా కుట్టించుకున్నా.. కుట్లూడిపోయే రోజులు రాబోతున్నాయి.. బీరువా బీగాలు ఎంత బరువుగా బిగించుకున్నా..లూజయ్యే రోజులు..ముందున్నాయి.. బ్యాంక్ ఖాతాల్లో వాల్యూమ్‌ ఎంత నిండుగా ఉన్నా..నిండుకునే రోజులు ఆన్‌ది వే… రెడీగా ఉండండి. ఆల్రెడీ గ్యాస్ బండ పేద్ద గుదిబండై కూర్చుంది. ఇంకా ముందు ముందు పెట్రో మంటలు అంటుకోబోతున్నాయి.. మన వంటింట్లో వంటగ్యాస్ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఉప్పు, పప్పు,నూనెలు ఏది ముట్టుకున్నా షాక్ కొట్టబోతున్నాయి.. ఇక విమానం కూడా మోతెక్కబోతోంది.. అంటే ఎగిరేవి..తిరిగేవి.. నడిచేవి..పాకేవి, తినేవి..ఇలా ప్రతి రంగమూ రంగస్థలమే. ప్రతి రోజూ రణస్థలమే. ప్రతి గంటా ధరలతో యుద్ధమే.

ప్రపంచంలో ఏమూల ఏమి జరిగినా.. దాని ప్రభావం దాని ఫలితం.. దాని కష్టం.. దాని నష్టం.. చిట్టచివర ఉన్న వినియోగదారుడి నెత్తిమీదే పడుతుంది. కమర్షియల్ గ్యాస్ బండ రేటు ఇప్పుడు 993రూపాయలు పెరిగింది. దాని భారం హోటల్ యాజమాని భరిస్తాడా.. నో వే. వినియోగదారుడికే బిల్లు..మన జేబుకే చిల్లు.

మన కష్టం నష్టంతో అమెరికా అధ్యక్షుడికి పనిలేదు.ఇరాన్ సుప్రీంలీడర్‌కు అంత ఇంట్రస్టూ లేదు. వాళ్లిద్దరికీ కావాల్సింది వాళ్ల ఇగోలు సాటిస్‌ఫై కావడమే. అందుకోసం ఇప్పుడు ప్రపంచాన్నే రోస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగని అక్కడ యుద్ధం ఉందా అంటే లేదు. ఒక్క బుల్లెట్ దూసుకుపోలేదు, ఒక్క మిస్సైల్ లాంచ్ కాలేదు. కానీ ఆసెగతాలూకా పొగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏదో వారంతో పోతుందనుకుంటే వారాలు పోయి నెలలు గడుస్తున్నా, పశ్చిమాసియాలో మంటలు చల్లారడంలేదు. మనకు ధరల మోత తగ్గడంలేదు. దాని ఎఫెక్టే..కమర్షియల్‌ LPG సిలిండర్‌ ధర భారీగా పెరగడం. ఒక్క సిలిండర్‌పై 993 రూపాయలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధర మే1 నుంచే అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ వార్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలుమార్లు కమర్షియల్‌ LPG సిలిండర్‌ ధరను పెంచిన కంపెనీలు.. ఇప్పుడు ఏకంగా 993 రూపాయలు పెంచడం మరింత షాకే. పెంచిన ధరతో ఇప్పుడు అక్షరాల కమర్షియల్ గ్యాస్ ధర 3వేల260 రూపాయలు.

ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధ టెన్షన్ తర్వాత ఖర్చుల భారం విపరీతంగా పెరిగింది. ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న అతిపెద్ద ప్రెజర్ పాయింట్ కమర్షియల్ LPG. ఒకరకంగా కిచన్‌కు హార్ట్‌. రెస్టారెంట్ ఖర్చులో గ్యాస్ వాటా 8 నుంచి 12 శాతం మధ్య ఉంటుంది. చిన్న టిఫిన్ సెంటర్‌కు 15 శాతం దాకా వెళ్లొచ్చు. ఇప్పుడు గ్యాస్ ధర 30 శాతం పెరిగితే, మొత్తం ఆపరేటింగ్ సిస్టంపై కనీసం 3 నుంచి 5 శాతం అదనపు భారం పడుతుంది.ఇది ఇక్కడితో ఆగదు. గ్యాస్ ధర పెరగడం అంటే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ట్రక్కులు, డెలివరీ వాహనాలు అన్నీ డీజిల్ మీదే నడుస్తాయి. డీజిల్ ధర పెరిగితే వెజిటబుల్స్, ధాన్యంపై ఎఫెక్ట్ పడుతుంది. ఉదాహరణకు, ఒక టన్ను కూరగాయలను మార్కెట్‌కి తీసుకురావడానికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు 2వేలు అయితే పెరిగిన ధరలతో అది 2500 దాటుతుంది. అంటే 20 నుంచి 25 శాతం భారం పడుతుంది.ఈ భారమంతా రెస్టారెంట్ పై పడుతుంది. ఎండ్‌ ఆఫ్‌ది డే అది అది వినియోగదారుడి జేబుకే చిల్లు పెడుతుంది.

ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం. ఎడిబుల్ ఆయిల్. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ పెరిగితే, పామాయిల్, సోయా ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి. గత మూడు నెలల్లో ఎడిబుల్ ఆయిల్ హోల్‌సేల్ ధరల్లో 10 నుంచి 15 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్న హోటల్స్‌కు ఇది భారీ షాక్.అలాగే ప్యాకేజింగ్ ఖర్చు కూడా పెరిగింది. ఆన్‌లైన్ డెలివరీలు పెరగడంతో, ప్లాస్టిక్ కంటైనర్స్, బాక్సులు, కవర్లు అన్నీ ధరలు 8 నుంచి 12 శాతం పెరిగాయి. ఇవన్నీ కలిపి చూస్తే—ఒక ప్లేట్ భోజనం తయారీ ఖర్చు గత ఏడాదితో పోలిస్తే కనీసం 20 నుంచి 30 శాతం పెరిగింది.

ఇప్పుడు రెస్టారెంట్ ముందు మూడు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మొదటిది—ధర పెంచడం. రెండోది—పోర్షన్ తగ్గించడం. మూడోది—క్వాలిటీ తగ్గించడం. ప్రస్తుతం ఎక్కువ మంది మొదటి, రెండో ఆప్షన్స్ కలిపి వాడుతున్నారు. మెనూ ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. కొన్ని చోట్ల సైలెంట్‌గా సైజ్ తగ్గించారు. వినియోగదారుడు గమనించకపోయినా, బిల్లు మాత్రం వాచిపోతోంది. అలాగే రెస్టారెంట్‌లో పనిచేసే ఉద్యోగుల ఉపాధిపైనా కోతపడుతుంది.

క్రూడ్ ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉంటే, కమర్షియల్ LPG ధరలు త్వరగా తగ్గే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క బ్యారెల్ ధర 90 డాలర్లకు దగ్గరగా ఉంటే, LPG ధరలు హై రేంజ్‌లోనే ఉండే అవకాశముంది. మరో 2 నుంచి 3 నెలలు ఈ ట్రెండ్ కొనసాగితే, సిలిండర్ ధర 4వేలు మార్క్‌ను కూడా తాకే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం ఫుడ్ సర్వీస్ ఎకోసిస్టమ్‌ను దెబ్బతీస్తుంది.

గ్యాస్ ధరకే మనకు చుక్కలు కనిపిస్తే ..పెట్రో ధరలు పెరిగితే సామాన్యుడు తట్టుకోగలడా.ద్రవ్యోల్బణం రెక్కలు తొడగదా ? ఇప్పటికే సర్వీసులు సగానికి సగం తగ్గించేందుకు విమానయానసంస్థలు సిద్ధమయ్యాయి. అటు ఎగుమతులు తగ్గి రైతన్న బక్కచిక్కిపోయాడు.ఆక్వారంగం కుదేలయింది. నిత్యవసరాలు ముట్టుకుంటే మంటెక్కిపోయే పొజిషన్‌కు చేరబోతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. అంటే ఇకముందు రోజులు ప్రతిరోజూ ధరలతో యుద్ధం చేయాల్సిందేనా ? సగటు జీవి జీతం, జీవితం హారతి కర్పూరమేనా ?

ఆకాశంలో ఎగిరే ప్రతి విమానం… నేలపై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇంధన ధర పెరిగితే, టికెట్ మాత్రమే కాదు… ప్రతీ కదలిక ఖరీదే. విమానయాన రంగంలో అతిపెద్ద ఖర్చు ATF. సాధారణంగా ఒక ఎయిర్‌లైన్ ఆపరేషనల్ ఖర్చులో 35 నుంచి 45 శాతం వరకు ఫ్యూయెల్‌కే వెళ్తుంది. గతేడాది ఈసమయంలో ATF ధర కిలోలీటర్‌కు సుమారు 85వేల నుంచి రూ95వేల మధ్య ఉండేది. తర్వాత క్రూడ్ ధరల పెరుగుదలతో ఇది రూ.లక్షా 5వేల మార్క్ దాటింది. ఇటీవల సవరణల్లో మరో 5 శాతం పెరిగి, రూ.లక్షా 10 వేలకు చేరింది. అంటే ఏడాది వ్యవధిలో సుమారు 15 నుంచి 20 శాతం పెరిగింది.

ఒక సింగిల్ న్యారోబాడీ విమానం రోజుకు 8 నుంచి 10 సెక్టార్లు ఫ్లై అవుతుందనుకుంటే, అంటే రోజుకు 8 నుంచి 10 టేకాఫ్‌లు తీసుకుంటే, ఫ్యూయెల్ ఖర్చే రోజుకు లక్షల్లో ఉంటుంది. ఈ అదనపు ఖర్చును తట్టుకోవడానికి ఎయిర్‌లైన్స్ తీసుకునే తొలి స్టెప్ యీల్డ్ మేనేజ్‌మెంట్. అంటే టికెట్ ధరలు పెంచడం. ఇటీవల డొమెస్టిక్ రూట్లలో సగటు టికెట్ ధర 8 నుంచి 15 శాతం పెరిగినట్లు ట్రావెల్ ప్లాట్‌ఫార్మ్ డేటా సూచిస్తోంది. పీక్ రూట్లలో పెరుగుదల ఇంకా ఎక్కువ. ఇది డిమాండ్‌పై వెంటనే ప్రభావం చూపుతుంది.

ఇక్కడ రెండో స్టెప్ కెపాసిటీ రేషనలైజేషన్. లోడ్ ఫ్యాక్టర్ తగ్గే రూట్లలో ఫ్రీక్వెన్సీ తగ్గించడం ప్రారంభమవుతుంది.ఇటీవల రోజుకు దాదాపు వంద వరకు ఫ్లైట్స్ తగ్గించినట్లు ఫ్లై డేటా చెబుతోంది. ఎయిరిండిగా కూడా రోజువారీ సర్వీసుల్ని 100కు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్‌ రోజుకు సగటున 1100 సర్వీసుల్ని నడుపుతోంది. ఫ్యూయిల్ ధర కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి సుదూర అంతర్జాతీయ మార్గాల్లోని సర్వీసులకు కోత పెట్టనుంది. ఈ మార్గాల్లో ఇంధన వినియోగం ఎక్కువగా ఉండటమే కాదు, ఆక్యుపెన్సీ కూడా పెద్దగా ఉండదు. ఢిల్లీ, ముంబై, లండన్, పారిస్‌, న్యూయార్క్, టొరంటో, శాన్‌ఫ్రాన్సిస్కో, సిడ్నీ, మెల్‌బోర్న్‌ నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య ఇకనుంచి తగ్గించనుంది.

ఇటీవల కొన్ని వారాల్లోనే ఏటీఎఫ్ ధరలు దాదాపు 80 శాతం పెరిగాయి. దీంతో విమాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం ఏటీఎఫ్‌కే వెచ్చించాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దేశంలో చాలా ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నడుస్తున్నాయి. ఫ్యూయెల్ ఖర్చు పెరిగితే, ఆపరేటింగ్ మార్జిన్ కూడా తగ్గుతుంది. ఇది ఫ్లీట్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్లపై ప్రభావం పడుతుంది. అంటే కొత్త విమానాల కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతుంది.
క్రూడ్ ధరల్లో మరో 2 నుంచి 3 నెలలు ఇదే ట్రెండ్ కొనసాగితే, టికెట్ ధరల్లో మరో 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో విమాన ప్రయాణం మరింత ఖరీదవుతుంది.

యుద్ధం టెన్షన్ రైతన్నపై కూడా పడింది. యుద్ధ భయంతో గ్లోబల్ ట్రేడ్ మార్గాలను పూర్తిగా డిస్టర్బ్ అయ్యాయి. ముఖ్యంగా మిడిలీస్ట్ రూట్‌పై రిస్క్ పెరగడంతో షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. కంటైనర్ రేట్లు కొన్ని రూట్లలో 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు ట్రేడ్ డేటా చెబుతోంది. ఇక షిప్‌ల ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 15 నుంచి 25 శాతం వరకు పెరిగింది.ఇది ఎగుమతిదారుడిపై ప్రభావం పడింది. ఇక ఆన్‌టైమ్ డెలివరీ కాకుంటే, మామిడి, అరటి క్వాలిటీ తగ్గిపోతుంది. ఇది రైతన్నకు తీవ్ర నష్టమే. ఆక్వా రంగం కూడా ఇదే పరిస్థితి. ఫీడ్ ఖర్చు గతేడాదితో పోలిస్తే 10 నుంచి 15 శాతం పెరిగింది. అలాగే యుద్ధంవల్ల ఎగుమతులు మందగించాయి. దీంతో ఆక్వారైతు తీవ్రంగా నష్టపోయాడు.

గ్లోబల్ టెన్షన్ తగ్గకపోతే,ఎగుమతి రంగం మరింత ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావం గ్రామీణ ఆదాయంపై పడుతుంది. గ్రామీణ ఆదాయం తగ్గితే, వినియోగం తగ్గుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే చైన్ రియాక్షన్. ఎన్నికల కారణంగా కొంతకాలం ధరలను స్థిరంగా ఉంచినా, ఇప్పుడా ప్రెజర్ తగ్గడంతో పెట్రో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఆయిల్ కంపెనీలకు ప్రస్తుతం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ధరలను పెంచి నష్టాన్ని రికవర్ చేయడం… లేక కొంతకాలం నష్టాన్ని భరించడం. ధరలు పెరిగితే, పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు—ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, సర్వీసెస్ ఇలా అన్ని రంగాల్లో ఖర్చు పెరుగుతుంది. చివరకు ఇది ఇన్ఫ్లేషన్‌పైనా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ధరలు పెంచకుండా ఉంటే కంపెనీలు నష్టపోతాయి. దీని భారం చివరకు ఫిస్కల్ మీద పడుతుంది. అది పన్నుల రూపంలో తిరిగి ప్రజలపైనే పడుతుంది. అంటే తగ్గినా, తగ్గించకపోయినా చివరకు వినియోగదారుడే బలి.

అక్కడ యుద్ధం..ఇక్కడ ఖర్చుల భారం. అక్కడ షిప్‌లు ఆగిపోతే, మనదగ్గర ధరలు పరుగులు పెడుతున్నాయి. అయినా సరే మన భారత ఎకానమీ స్టేబుల్‌గా ఉంది. షిప్‌లు ఆగినా, పెట్రో సరఫరా ఆగలేదు.మరి మన ఆర్ధిక శక్తిది బలుపా ? వాపా ? RBI చెబుతున్న చేదు నిజం ఏంటి.. యుద్ధపరిస్థితులు కొనసాగితే ఆ ఒత్తిడిని మన ఎకానమీ ఎంతకాలం తట్టుకోగలదు ?

“గాలి బలంగా వీస్తేనే చెట్టు వేర్లు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది..మన భారత ఆర్ధిక వ్యవస్థ కూడా అంతే. ఇంత క్లిష్టపరిస్థితుల్లో కూడా స్టేబుల్‌గా ఉంది. కారణం..దేశీయ మార్కెట్ బలంగా ఉండడం. కానీ పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సరఫరా చైన్ తెగింది. ఇంపోర్ట్ ధరలు పెరగడంతో మన ఎకానమీ కొత్తసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి ఉన్నా, ఓవర్ కమ్ అయ్యే సత్తా మనకుందని లేటెస్ట్ బులిటెన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.కానీ మున్ముందు పశ్చిమాసియా పరిస్థితులు చక్కబడకుంటే ఒత్తిడి తప్పదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ దగ్గర షిప్‌ రాకపోకలు దాదాపు క్లోజ్ కావడంతో గ్లోబల్ సరఫరా చైన్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో అన్నదానిపైనే మన ఆర్ధికవృద్ధి ఆధారపడి ఉందంటోంది RBI

మార్చినెలలో పలు భారత్‌ షిప్‌లు హర్మూజ్ దగ్గర బ్లాక్ కావడంతో ఎనర్జీ, ఎరువుల ధరల పెరిగాయి. వరల్డ్ బ్యాంక్ కమోడిటీ ధరల సూచీ భారీగా పెరిగాయి. అయినా భారత్ ఇప్పటివరకు తట్టుకుని నిలబడగలిగింది. ఎక్స్‌టర్నల్ డెట్-టు-GDP, IIP-టు-GDP, డెట్ సర్వీస్ రేషియోలు డిసెంబర్ 2025 నాటికి కంట్రోల్‌లోనే ఉన్నాయి. అంటే
దేశం బయట నుంచి తీసుకున్న అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ముఖ్యసూచీలు నియంత్రణలో ఉన్నాయి. ప్రమాదం స్థాయికి చేరలేదని ఆర్బీఐ చెబుతోంది.

అలాగే విదేశీ మారక నిల్వలు కూడా బలంగా ఉండడంతో, 11 నెలల దిగుమతులను కవర్ చేయగలిగాము. అయితే యుద్ధ ప్రభావం ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్రంగా పడింది.
గ్లోబల్ మార్కెట్లు పడిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిలో పడ్డాయి. మార్చిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపగా, ఏప్రిల్‌లో తాత్కాలిక సీజ్‌ఫైర్, క్రూడ్ ధరల తగ్గుదలతో కొంత ఉపశమనం కలిగింది. రూపాయి కూడా ఈ కాలంలో డాలర్‌తో పోలిస్తే బలహీనపడింది, అయితే RBI చర్యలు, అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ కారణంగా ఏప్రిల్‌లో ఒత్తిడి కొంత తగ్గింది.

అయితే కొన్ని రంగాల్లో మిశ్రమఫలితాలు రావడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం తట్టుకోగలిగినా మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గోల్డ్ తప్ప మిగతా కమోడిటీ ధరలు విస్తృతంగా పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ఆస్తుల విలువలు పడిపోవడం వల్ల వినియోగదారుల నమ్మకం దెబ్బతింది.
2026లో గ్లోబల్ వృద్ధి మందగించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేస్తోంది. ఈ ప్రభావం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రతి రంగంలో మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది. పోర్ట్ కార్గో, ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గిపోయింది.
అలాగే మరో డేంజర్ బెల్ PMI..పర్చేసింగ్ మేనేజింగ్ ఇండెక్స్ ప్రమాదకరస్థాయిలో ఉంది. అంటే ఫ్యాక్టరీల స్థితిని కొలిచే సూచి. కొత్త ఆర్డర్లు వస్తున్నాయా, ఉత్పత్తి పెరుగుతుందా, ఉద్యోగాలు పెరుగుతున్నాయా, సరఫరా సజావుగా ఉందా లాంటి విషయాలపై సర్వే చేసి స్కోర్ ఇస్తారు. ఈస్కోర్ 50పైగా ఉంటే పరిశ్రమ ఎదుగుదల ఉన్నట్లే. కానీ ఇప్పుడున్న పరిస్థుతుల్లో స్కోర్ 50కు తగ్గిపోయింది. అంటే ఫ్యాక్టరీల పనితీరు ఎన్నడూలేనంత కనిష్టానికి పడిపోయింది. పర్ ఎగ్జాంపుల్ ఒక షాపుకు రోజుకు 100 మంది కస్టమర్లు వస్తే ఇప్పుడు 60కి తగ్గిపోతే, అప్పుడు షాపు యజమాని కొత్త స్టాఫ్ పెట్టడు, ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాడు.అదే పరిస్థితి ఇప్పుడు ఫ్యాక్టరీల్లో కనిపిస్తోంది. PMI పడిపోవడం అంటే ఎకానమీ ఇంజిన్ స్పీడ్ తగ్గుతోందని హెచ్చరిక.

అయితే ఇంత స్ట్రగుల్స్‌లో కూడా దేశవ్యాప్తంగా పెట్రోలియం సరఫరాకు అంతరాయం లేకపోవడం. కొన్నిచోట్ల పెట్రో కొరత ఉన్నప్పటికీ కేంద్రం చర్యలతో తీవ్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తలేదన్నది ఆర్బీఐ అభిప్రాయం. అయితే యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే పరిస్థితి మారే ప్రమాదం ఉంది. ఎనర్జీ ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇన్‌పుట్ ఖర్చులపై ఒత్తిడి ఉంటుంది. ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. RBI ప్రధానంగా హెచ్చరిస్తున్న అంశం, సప్లై షాకిస్తే, డిమాండ్‌ కూడా షాకిస్తుంది. అంటే ధరలు పెరగితే ప్రజలు ఖర్చు తగ్గిస్తారు. దీంతో ఆర్ధిక వృద్ధి మందగిస్తుంది.

ఈ అనిశ్చితి కారణంగానే RBI ఏప్రిల్ ద్రవ్య విధానంలో రెపో రేటును మార్చకుండా ఉంచింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికీ, రాబోయేరోజుల్లో ఎగబాకేసూచనలున్నాయని సెంట్రల్‌బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. టాక్స్ వసూళ్ల పరంగా బాగుంది. బ్యాంకింగ్ సిస్టమ్ స్థిరంగా ఉంది.కొనుగోళ్లు బాగానే ఉన్నాయి. అయితే బయటి ఒత్తిడిలు కొనసాగితే మాత్రం కఠిన పరీక్ష తప్పదంటోంది ఆర్బీఐ. ఆ ప్రెజర్‌ దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకూడదంటే, పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తక్షణమే తగ్గాలి. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదంలో పడటం ఖాయమంటోంది RBI.

RBIఅంచనా ప్రకారం ప్రస్తుతానికైతే మన ఆర్ధికవృద్ధికి డోకాలేదు. ద్రవ్యోల్బణం కంట్రోల్‌ తప్పలేదు. కానీ పరిస్థితులు మాత్రం ఇలాగే ఉంటే కంట్రోల్ తప్పిపోయే ప్రమాదం ఉందన్నది ఆర్బీఐ చేస్తున్న హెచ్చరిక. మరి రాబోయేరోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాళ్టి బర్నింగ్‌టాపిక్‌.రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *