Headlines

రోడ్డు పక్కన 1200కు కొన్నది.. వేలంలో 2 కోట్లకు అమ్మింది.. ఈ నెక్లెస్ కథ మామూలుగా లేదుగా..


సంతలో లేదా ఫుట్‌పాత్ మార్కెట్లలో మనం పాత వస్తువులను సరదాగా కొంటుంటాం. అయితే సాధారణ వస్తువు అనుకుని అతి తక్కువ ధరకు కొన్న ఓ ఆభరణం.. ఆ తర్వాత కోట్ల రూపాయల విలువైన ప్రపంచ స్థాయి కళాఖండమని తెలిస్తే? సరిగ్గా అలాంటి అద్భుతమే అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన నోర్మా ఇఫిల్ అనే మహిళ జీవితంలో జరిగింది. కొన్నేళ్ల క్రితం బ్రూక్లిన్‌లోని ఓ ఫ్లీ మార్కెట్‌లో తిరుగుతున్న సమయంలో నోర్మా దృష్టిని ఒక విచిత్రమైన నెక్లెస్ ఆకర్షించింది. వెండి తీగలు, దారంతో చేసిన ఆ డిజైన్ నచ్చడంతో ఆమె కేవలం 15 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,250) చెల్లించి కొనుగోలు చేసింది. అది ఒక సాధారణ వింటేజ్ ఆభరణమని భావించి, నాలుగైదు సార్లు పార్టీలకు కూడా ధరించింది. ఆ నెక్లెస్ వేసుకున్న ప్రతిసారీ అందరూ దాని ప్రత్యేకమైన డిజైన్‌ను మెచ్చుకునేవారు.

ఎగ్జిబిషన్‌లో బయటపడ్డ అసలు సీక్రెట్

ఓసారి ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ప్రఖ్యాత శిల్పి అలెగ్జాండర్ కాల్డర్ నగల ప్రదర్శనకు నోర్మా వెళ్లారు. అక్కడ ప్రదర్శించిన ఆభరణాలను చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న డిజైన్లు అచ్చం తన వద్ద ఉన్న నెక్లెస్‌లాగే ఉన్నాయి. వెంటనే అనుమానం వచ్చి జ్యువెలరీ నిపుణులను సంప్రదించగా.. అది 1940 కాలంలో అలెగ్జాండర్ కాల్డర్ స్వయంగా తయారు చేసిన అసలైన నెక్లెస్ అని తేలింది. ‘‘ఇంతకాలం నా దగ్గరున్నది కాల్డర్ రూపొందించిన అరుదైన ఆభరణమని తెలిసి నమ్మలేకపోయాను’’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎవరీ అలెగ్జాండర్ కాల్డర్?

20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ కళాకారుడైన అలెగ్జాండర్ కాల్డర్ కదిలే శిల్పాలు తయారు చేయడంలో దిట్ట. 1920-30ల కాలంలో ఆయన లోహాలు, తీగలు, విభిన్న వస్తువులతో ఆభరణాలను చేతితోనే రూపొందించేవారు. స్నేహితులు, నృత్యకారులు, కళాకారులకు బహుమతులుగా ఇచ్చేవారు. అందుకే ఆయన ఆభరణాలు వాణిజ్య మార్కెట్లలో కాకుండా వ్యక్తిగత పరిచయాల ద్వారా చేతులు మారేవి. శరీర కదలికలకు అనుగుణంగా స్పందించే ఈ నెక్లెస్‌లను కళాకారులు సూక్ష్మ శిల్పాలుగా పరిగణిస్తారు.

క్రిస్టీస్ వేలంలో కోట్ల రూపాయల రికార్డు

ఈ అరుదైన నెక్లెస్‌ను ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రిస్టీస్ వేలం సంస్థకు అప్పగించారు. 2013లో నిర్వహించిన పోస్ట్-వార్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ వేలంలో అన్‌టైటిల్డ్ పేరిట దీనిని ప్రదర్శించారు. దీనికి తొలుత 2 నుండి 3 లక్షల డాలర్ల ధర పలుకుతుందని అంచనా వేయగా.. తీవ్రమైన పోటీ నడుమ యూరోపియన్ వ్యాపారి ఏకంగా 2,67,750 డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ.2.23 కోట్లు) దక్కించుకున్నారు.

రోడ్డు పక్కన రూ.1,200 పెట్టి సరదాగా కొన్న ఓ పాత వస్తువు.. సరైన గుర్తింపు దక్కేసరికి రూ.2 కోట్లకు పైగా పలికి చరిత్ర సృష్టించింది. కళాఖండాల విలువ తెలిసినప్పుడు అవి ఊహించని ప్రదేశాల నుంచే వెలుగులోకి వస్తాయనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *