Headlines

రైళ్లలో నీళ్లు, ఆహార పదార్థాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? వెంటనే ఇలా చేయండి!

రైళ్లలో నీళ్లు, ఆహార పదార్థాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? వెంటనే ఇలా చేయండి!


రైళ్లలో ప్రయాణించే సమయంలో ఆహార పదార్థాలు, టీ, కాఫీ లేదా నీటి బాటిళ్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి విక్రేతలు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు స్పష్టమైన హక్కులు ఉన్నాయని IRCTC, భారతీయ రైల్వేలు వెల్లడిస్తున్నాయి. IRCTC నిబంధనల ప్రకారం రైళ్లలో విక్రయించే ప్రతి ఆహార, పానీయ వస్తువును నిర్ణీత ధరలకే అమ్మాలి. మెనూలో పేర్కొన్న ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతి నమోదిత విక్రేత వద్ద మెనూ కార్డు ఉండటం తప్పనిసరి. అందులో అందుబాటులో ఉన్న అన్ని వస్తువుల ధరలు స్పష్టంగా చూపించాలి. ఒకవేళ విక్రేత మెనూ చూపించడానికి నిరాకరిస్తే, అది కూడా నిబంధనలకు విరుద్ధమే.

ప్రయాణికులు ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బిల్లులో వస్తువు పేరు, ధర, తేదీ వంటి వివరాలు ఉంటాయి. భవిష్యత్తులో ఫిర్యాదు చేయాల్సి వచ్చినప్పుడు ఇదే ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ విక్రేత అధిక ధర వసూలు చేస్తే, ప్రయాణికులు వెంటనే స్పందించాలని రైల్వేలు సూచిస్తున్నాయి. ఇందుకోసం 139 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు లేదా SMS ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే రైలులో ఉన్న TTE లేదా RPF సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వొచ్చు. ఫిర్యాదు సమయంలో PNR నంబర్, కోచ్, సీటు నంబర్, సంఘటన జరిగిన సమయం వంటి వివరాలు అందిస్తే త్వరగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

విచారణలో విక్రేత తప్పు చేసినట్లు తేలితే జరిమానా విధించడంతో పాటు వారి లైసెన్సును కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే వారిని రైలు సేవల నుంచి తొలగించవచ్చు. అదనంగా వసూలు చేసిన డబ్బును ప్రయాణికులకు తిరిగి చెల్లించే అవకాశమూ ఉంటుంది. అందువల్ల రైలులో ఏదైనా కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించడం, తప్పనిసరిగా బిల్లు తీసుకోవడం, అధిక వసూళ్లు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా ప్రయాణికులు తమ హక్కులను కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *