Headlines

రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్! పరీక్షలు ఎప్పుడంటే?


హైదరాబాద్‌, సెప్టెంబర్ 17: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి సంబంధించిన CBT-1 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 4,029 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు 111 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13తో ముగిసింది. అయితే అభ్యర్థులకు దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీ వరకు సవరణ అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈ గడువులోగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

CBT-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పరీక్షా నగరం, తేదీ వివరాలతో కూడిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను పరీక్షకు 10 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు RRB తెలిపింది. అలాగే అడ్మిట్ కార్డులను పరీక్షకు 4 రోజుల ముందు విడుదల చేయనుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్టేజ్ 1 CBT, స్టేజ్ 2 CBT, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఉంటాయి. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం సంబంధిత పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు తదితర వివరాల కోసం తమకు సంబంధించిన RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

ఆర్‌ఆర్‌బీ JE పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *