Headlines

రుద్రప్రయాగ్‌లో అద్భుతం.. రాత్రివేళ ఓ ఇంట్లోకి చొరబడ్డ చిరుతకు చుక్కలు కనిపించాయి..! సీసీఫుటేజ్‌ వైరల్‌


ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక పెంపుడు కుక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుద్రప్రయాగ్‌లోని వికాస్ భవన్ కార్యాలయం సమీపంలో ఉన్న ఒక ఇంట్లో రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ వీడియో ఆధారంగా.. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద చిరుతపులి నిశ్శబ్దంగా ఆ కాంపౌండ్ లోపలికి ప్రవేశించింది. అక్కడే ఉన్న టేబుల్‌పై హాయిగా నిద్రిస్తున్న పెంపుడు కుక్కను చూసి దానిపై ఒక్కసారిగా ఎగిరిపడింది. నోటితో కుక్క మెడను గట్టిగా పట్టుకుని టేబుల్ కిందకు ఈడ్చుకెళ్లింది.

సాధారణంగా చిరుతపులి దాడి చేస్తే చిన్న జంతువులు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. కానీ, ఈ పెంపుడు కుక్క మాత్రం ప్రాణభయాన్ని పక్కనపెట్టి తీవ్రంగా ప్రతిఘటించింది. చిరుతతో పోరాడుతూ విడిపించుకోవడానికి గట్టిగా విరుచుకుపడింది. కుక్క ఊహించని రీతిలో తిరగబడటంతో కంగుతిన్న చిరుతపులి భయపడి దాన్ని వదిలేసి వెనక్కి పారిపోయింది. అయినా వదలకుండా ఆ కుక్క ధైర్యంగా చిరుతను కొంతదూరం వరకు వెంబడించి బయటకు తరిమి కొట్టింది.

కుక్క అరుపులు విని ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు రావడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఈ దాడిలో కుక్క సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో జనావాసాల మధ్య చిరుతల సంచారం తీవ్రంగా పెరిగిపోయిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి, వెంటనే ఆ చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *