
వివాహం.. అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాల అనుబంధం, జీవితకాలపు బాధ్యతల సమ్మేళనం. ఈ ప్రయాణంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది, ప్రత్యేకమైనది. ఒకే నాణేనికి ఉన్న రెండు వైపుల్లా భార్యాభర్తలు జీవితపు ఒడిదుడుకులను కలిసి ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకరి బలాన్ని మరొకరు ప్రోత్సహించుకుంటూ.. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే నిజమైన దాంపత్యం అని అంటుంటారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి అలకలు, అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణమే.
ఈ తరహా ఘటనలు జరిగినంత మాత్రాన ప్రేమ తగ్గిందని భావించొద్దని సూచిస్తున్నారు. కాసేపటి తర్వాత మళ్లీ కవ్వింతలు, కబుర్లతో ఆ అలకలు కరిగిపోయి.. వారి బంధం మరింత దృఢంగా మారాలని చెబుతున్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే భార్యాభర్తల బంధానికి అసలైన అందమని వివరిస్తున్నారు. అయితే ప్రతి భర్తకు కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. కానీ మీ భర్తలో కనుక ఈ ఐదు ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లయితే, మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఆ ముఖ్యమైన గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ప్రతి పనిలోనూ భాగస్వామ్యం..
సంపాదన, బయటి వ్యవహారాలే కాకుండా ఇంటి పనులు, పిల్లల పెంపకంలోనూ భర్త తన వంతు బాధ్యతను పంచుకోవడం. ఇల్లు, సంసారం అనేవి కేవలం భార్యకు మాత్రమే పరిమితం కాదని, ఇద్దరి ఉమ్మడి బాధ్యత అని భావించే భర్త దొరకడం నిజంగా ఒక వరం.
2. తప్పును అంగీకరించే గుణం..
దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, తన వైపు తప్పు ఉంటే ఎలాంటి భేషజాలకు పోకుండా క్షమాపణ చెప్పడం. ‘నేనెందుకు తగ్గాలి’ అనే పురుషాహంకారాన్ని పక్కన పెట్టి, అహం కంటే అనుబంధానికే విలువనిచ్చే వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉంటే ఆ కాపురం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది.
3. చిన్న విషయాల్లోనూ ఎనలేని ప్రేమ..
ఖరీదైన బహుమతుల కంటే చిన్నపాటి ఆప్యాయతకే మహిళలు ఎక్కువగా మురిసిపోతారు. ‘తిన్నావా?’, ‘అలసిపోయావా?’, ‘కాసేపు విశ్రాంతి తీసుకో’ అంటూ భర్త చూపే చిన్న చిన్న జాగ్రత్తల్లోనే వారు కొండంత ప్రేమను వెతుక్కుంటారు. ఇలా ప్రతిక్షణం కేరింగ్‌గా ఉండే భర్త ఉంటే అంతకంటే సంతోషం ఏముంటుంది.
4. కోపంలోనూ సంయమనం..
గొడవలు జరిగినప్పుడు ఆవేశంలో ఒకరినొకరు హేళన చేసుకోవడం, ఇరువైపులా కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడటం చాలామంది చేసే పొరపాటు. కానీ ఉత్తమ భర్త ఎంత కోపంలో ఉన్నా తన హద్దులు దాటడు. భాగస్వామి మనసు నొచ్చుకునేలా అవమానకర మాటలు మాట్లాడకుండా సంయమనం పాటిస్తాడు.
5. కన్నీళ్లకు విలువనివ్వడం..
భార్య కంట నీరు వస్తే దానిని ఏమాత్రం తేలికగా తీసుకోకుండా, ఆ బాధకు గల కారణాన్ని తెలుసుకుని ఓదార్చడం. సమస్యకు పరిష్కారం చూపుతూ, తన జీవిత భాగస్వామి ఎప్పటికీ కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలని తపించే భర్త తోడుంటే, ఎలాంటి కష్టాన్నైనా సంతోషంగా దాటేయవచ్చు.