Headlines

మారనున్న పార్లమెంట్ రూపురేఖలు..! 816 ఎంపీ సీట్లతో కొత్త మ్యాప్! తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?


దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? పార్లమెంటులో ఎంపీల సంఖ్య భారీగా పెరగనుందా? నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలను ఏకంగా 816కు పెంచే ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించిన రాష్ట్రాల వారీ సీట్ల అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా సీట్ల సంఖ్య పెంచుతామని కేంద్రం చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.

లోక్‌సభలో 273 సీట్ల పెంపు ప్రతిపాదన

ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. ప్రతిపాదిత 50 శాతం పెంపు ప్రకారం ఇవి 816కు చేరనున్నాయి. ఇందులో 28 రాష్ట్రాలకు కలిపి 789 స్థానాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు 27 స్థానాలు కేటాయించేలా అంచనాలు రూపొందించారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తన ఎక్స్ ఖాతాలో రాష్ట్రాల వారీగా కొత్త సీట్ల వివరాలతో కూడిన మ్యాప్‌ను పంచుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పెరగనున్న స్థానాలు

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. అంటే మరో 9 స్థానాలు అదనంగా రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కు చేరనున్నాయి. అంటే 13 స్థానాలు పెరుగుతాయి. దక్షిణాదిలో తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి పెరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానం..

రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 నుంచి 120 స్థానాలకు పెరుగుతాయి. మహారాష్ట్రలో 48 నుంచి 72, పశ్చిమ బెంగాల్‌లో 42 నుంచి 63, బీహార్‌లో 40 నుంచి 60, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 43, గుజరాత్‌లో 26 నుంచి 39 స్థానాలకు పెరగనున్నాయి. రాజస్థాన్‌లో 25 నుంచి 38, ఒడిశాలో 21 నుంచి 31, పంజాబ్‌లో 13 నుంచి 20 స్థానాలకు పెరుగుతాయి.

కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పెంపు

ఢిల్లీ లోక్‌సభ స్థానాలు 7 నుంచి 11కు, జమ్మూకశ్మీర్‌లో 5 నుంచి 7కు పెరగనున్నాయి. చండీగఢ్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానం అదనంగా రానుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్, లడఖ్‌లలో మాత్రం ప్రస్తుతం ఉన్న ఒక్కో స్థానమే కొనసాగనుంది.

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదా?

ఈ పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే వాటి రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందన్నది ప్రధాన అభ్యంతరం. అయితే కేంద్ర మంత్రి వెల్లడించిన ప్రతిపాదన ప్రకారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల సీట్లు కలిపి ప్రస్తుతం 129 ఉండగా, కొత్త విధానంలో 195కు పెరుగుతాయి. మొత్తం లోక్‌సభలో వాటి వాటా 23.76 శాతం నుంచి 23.90 శాతానికి చేరుతుందని కేంద్రం చెబుతోంది.

ప్రతిపక్షాల అభ్యంతరాలు..!

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ పొందకపోవడంతో ముందుకు సాగలేదు. తాజాగా 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, కొత్త పునర్విభజన బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం కీలకం కానుంది.

మొత్తానికి 816 స్థానాల ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదిత అంచనాలు మాత్రమే. పార్లమెంట్ ఆమోదం, చట్టపరమైన ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుంది.

భారతదేశ పార్లమెంటరీ పటం ఈ విధంగా ఉంటుంది..

28 రాష్ట్రాలు

రాష్ట్రాలు – పునర్విభజనకు ముందు → తర్వాత

ఉత్తర ప్రదేశ్ – 80 → 120

మహారాష్ట్ర – 48 → 72

పశ్చిమ బెంగాల్ – 42 → 63

బీహార్ – 40 → 60

తమిళనాడు – 39 → 59

మధ్యప్రదేశ్ – 29 → 43

కర్ణాటక – 28 → 42

గుజరాత్ – 26 → 39

ఆంధ్రప్రదేశ్ – 25 → 38

రాజస్థాన్ – 25 → 38

ఒడిశా – 21 → 31

కేరళ – 20 → 30

తెలంగాణ – 17 → 26

అస్సాం – 14 → 21

జార్ఖండ్ – 14 → 21

పంజాబ్ – 13 → 20

ఛత్తీస్‌గఢ్ – 11 → 16

హర్యానా – 10 → 15

ఉత్తరాఖండ్ – 5 → 8

హిమాచల్ ప్రదేశ్ – 4 → 6

అరుణాచల్ ప్రదేశ్ – 2 → 3

గోవా – 2 → 3

మణిపూర్ – 2 → 3

మేఘాలయ – 2 → 3

త్రిపుర – 2 → 3

మిజోరం – 1 → 2

నాగాలాండ్ – 1 → 2

సిక్కిం – 1 → 2

8 కేంద్రపాలిత ప్రాంతాలు

కేంద్రపాలిత ప్రాంతాలు – పునర్విభజనకు ముందు → తర్వాత

ఢిల్లీ – 7 → 11

జమ్మూ మరియు కాశ్మీర్ – 5 → 7

దాద్రా , నగర్ హవేలీ , డామన్ డయ్యూ – 2 → 2

అండమాన్ మరియు నికోబార్ దీవులు – 1 → 1

చండీగఢ్ – 1 → 2

లడఖ్ – 1 → 1

లక్షద్వీప్ – 1 → 1

పుదుచ్చేరి – 1 → 2

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *