నీటి శాతం ఎందులో ఎక్కువ: దాహం తీర్చుకోవడంలో పుచ్చకాయకు సాటి ఏదీ లేదు.ఇందులో దాదాపు 90శాతం పైగా నీరు ఉంటుంది. ఎండలో తిరిగే వారికి, శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా చూడటంలో ఇది దిట్ట. మామిడి పండు రసభరితంగా ఉన్నప్పటికీ, దాని సాంద్రత ఎక్కువ. ఇది శరీరానికి తేమను అందిస్తుంది కానీ పుచ్చకాయ అంత వేగంగా బాడీని రీఛార్జ్ చేయలేదు.
శక్తి వర్సెస్ చల్లదనం: మామిడి పండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే మీకు మంచి శక్తిని ఇస్తుంది. నీరసంగా అనిపించినప్పుడు మామిడి పండు తింటే వెంటనే హుషారు వస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణమే సేదతీర్చడంలో పుచ్చకాయ నెంబర్ వన్. ఇది జీర్ణం కావడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది.
పోషకాల పరంగా ఏది టాప్: రెండు పండ్లూ ఆరోగ్య ప్రదాతలే, కానీ వాటి ప్రత్యేకతలు వేరు. మామడి లో విటమిన్-A, విటమిన్-C పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, ఎండ వల్ల చర్మం కాలిపోకుండా రక్షించడానికి తోడ్పడతాయి.
జీర్ణక్రియ – శరీర వేడి: ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మామిడి పండు రుచిగా ఉందని ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొందరికి వేసవిలో మొటిమలు లేదా వేడి కురుపులు వస్తుంటాయి. అందుకే మామిడి పండును మితంగా తినాలి. అదే పుచ్చకాయ అయితే ఎన్ని తిన్నా శరీరాన్ని చల్లబరుస్తూనే ఉంటుంది.
ఏది ఎప్పుడు తినాలి?: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పుచ్చకాయ తినడం ఉత్తమం. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. శక్తి కోసం, కడుపు నిండుగా ఉండటం కోసం ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో మామిడి పండును ఎంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం మామిడి పండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.




