Headlines

మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?


అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపై ఆశలు చెదిరిపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీని ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. వారపు తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం దలాల్‌ స్ట్రీట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే BSE సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,058 పాయింట్లు పడిపోయి 76,269 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో NIFTY 50 కూడా భారీ ఒత్తిడికి లోనైంది. మార్కెట్‌ పతనంతో పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.4 లక్షల కోట్ల మేర క్షీణత నమోదైంది.

ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన. ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతి చర్చల ఆఫర్‌ను ఆయన పూర్తిగా తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా, ఇరాన్‌ అణు సామర్థ్యాలను బలహీనపరిచే దిశగా అమెరికా మరింత దూకుడు చర్యలకు సిద్ధమవుతోందనే సంకేతాలు మార్కెట్లలో భయాందోళనలు పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 3.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరుకున్నాయి. భారత్‌ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాలు, కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇక బంగారం, ఆభరణాల రంగ షేర్లు కూడా భారీ ఒత్తిడికి లోనయ్యాయి. టైటాన్‌ కంపెనీ, సెన్కో గోల్డ్‌ వంటి కంపెనీల షేర్లు 9 శాతం వరకు పడిపోయాయి. దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు కూడా ఈ రంగంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు వంటి అంశాలు సమీప కాలంలో భారత మార్కెట్లలో మరింత అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *