బంగాళదుంపతో సహజ బ్లీచ్: బంగాళదుంప కేవలం కూరలకే కాదు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. బంగాళదుంప రసాన్ని నేరుగా ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. బియ్యప్పిండి, బంగాళదుంప రసం, కలబంద గుజ్జు, టమాటా రసం కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత వృత్తాకారంలో మసాజ్ చేస్తూ కడిగేస్తే ముఖం తక్షణమే ప్రకాశవంతంగా మారుతుంది.
నారింజ, నిమ్మ తొక్కల మ్యాజిక్: నారింజ, నిమ్మ పండ్లు తిన్న తర్వాత మనం సాధారణంగా వాటి తొక్కలను పారేస్తాం. కానీ వాటిలోనే చర్మానికి అవసరమైన విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా ముడతలను తగ్గిస్తుంది. తాజా నారింజ లేదా నిమ్మ తొక్కలను తురిమి మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. దీనికి ఒక విటమిన్ ఇ క్యాప్సూల్, కొద్దిగా కలబంద గుజ్జును జోడించండి. ఈ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు వాడటం వల్ల చర్మంపై ఉన్న టానింగ్ తగ్గి, చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా మారుతుంది.
మృతకణాల తొలగింపునకు ఓట్స్: ముఖం నిర్జీవంగా కనిపిస్తోందంటే దానికి కారణం పేరుకుపోయిన మృతకణాలు. వీటిని తొలగించడానికి ఓట్స్ అద్భుతమైన స్క్రబ్‌లా పనిచేస్తాయి. ఓట్స్ పౌడర్‌లో తేనె, పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి పట్టించండి. కొన్ని నిమిషాల తర్వాత సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడిగేయండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ముఖానికి మంచి ఛాయను ఇస్తుంది.
టమాటా: వేసవిలో చేతులు, పాదాలు, ముఖం ఎండ దెబ్బకు నల్లగా మారిపోతుంటాయి. ఈ సమస్యకు టమాటా ఒక రామబాణంలా పనిచేస్తుంది. టమాటాలోని లైకోపిన్ చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. ఒక టమాటాను సగానికి కోసి, దానిపై కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు చల్లండి. దీనితో ముఖంపై మరియు నల్లబడిన ప్రాంతాల్లో 5-10 నిమిషాల పాటు మర్దన చేయండి. ఇది చర్మంపై ఉన్న నలుపును తక్షణమే తొలగించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల సన్ ట్యాన్ సమస్య ఉండదు.
పురాతన పద్ధతి: మన అమ్మమ్మలు, నానమ్మలు పాటించే ఈ చిట్కా వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పెరుగు చర్మానికి తేమను అందిస్తే, పసుపులోని యాంటీ సెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన పసుపును పెరుగులో కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్‌తో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి. మార్కెట్లో దొరికే వంట పసుపు కంటే పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి వాడటం వల్ల చర్మంపై ఎరుపు రంగు పడకుండా ఉంటుంది.




