
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల ఖాతాదారులందరికీ అలర్ట్ జారీ చేసింది. 2026 నాటికి రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం, మనీ లాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాదారులు సకాలంలో తమ కేవైసీని అప్డేట్ చేసుకోవడం అత్యవసరమని స్పష్టం చేసింది,. ఖాతాదారుల గుర్తింపును, చిరునామా, ఆర్థిక కార్యకలాపాలను ధృవీకరించడం ద్వారా బ్యాంకులు తమ కస్టమర్లను తెలుసుకోవడానికి కేవైసీ సహాయపడుతుంది.
బ్యాంకులు కస్టమర్లను వారి లావాదేవీల స్వభావం, రిస్క్ స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా విభజిస్తాయి. జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు, చిన్న ఖాతాదారులు, ప్రభుత్వ ఉద్యోగులును తక్కువ రిస్క్ కేటగిరీగా భావిస్తారు. వీరు ప్రతి పదేళ్లకు ఒకసారి రీ-కేవైసీ చేయించుకోవాలి. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ఎన్నారైలు, చిన్న వ్యాపారులు, అధిక లావాదేవీలు నిర్వహించే కంపెనీలు మిడియం రిస్క్ కేటగిరీలో ఉంటాయి. వీరు ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి రీ-కేవైసీని అప్డేట్ చేయాలి. వీరు తమ ఆదాయ వనరులు, ఆశించిన లావాదేవీల గురించి బ్యాంకుకు తెలియజేయాలి. రాజకీయంగా ప్రముఖులు, యుద్ధ ప్రాంతాల నుండి వచ్చినవారు, ఆభరణాల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ డీలర్లు, ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు వంటివారు హైరిస్క్ వర్గంలోకి వస్తారు. వీరు ప్రతి రెండేళ్లకు ఒకసారి రీ-కేవైసీ చేయించుకోవాలి.
రీ-కేవైసీ చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..
సకాలంలో రీ-కేవైసీ చేయని ఖాతాదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తాయి. నోటీసుల తర్వాత కూడా స్పందించకపోతే.. మొదట ఖాతాను స్తంభించేస్తారు. దీని వల్ల డిపాజిట్లు, విత్‌డ్రాలు అనుమతించరు. ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే ఖాతాను పూర్తిగా మూసివేస్తారు. ప్రభుత్వాల నుంచి డబ్బులు, సబ్సిడీలు, పెన్షన్లు పొందే లబ్ధిదారులు రీ-కేవైసీని నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. గ్యాస్ సబ్సిడీ వంటి ప్రయోజనాలకు కూడా కేవైసీ తప్పనిసరి చేసింది. రీకేవైసీ కోసం మీ హోమ్ బ్రాంచ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. దేశంలో మీ బ్యాంకుకు సంబంధించిన ఏ బ్రాంచ్‌లోనైనా రీ-కేవైసీ చేసుకోవచ్చు. గ్రామాల్లో బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు (BC), స్థానిక ఏజెంట్ల ద్వారా కూడా రీ-కేవైసీ చేసుకోవచ్చు. రీ-కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే బ్యాంకుకు లేదా ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు