విజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడలోని గురునానక్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్‌కు వారం రోజుల క్రితం అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తమ వద్దకు వచ్చిన సమాచారం ప్రకారం బాధితుడి ఫోన్ నంబర్ వివిధ నేరాల్లో ఉపయోగించబడిందని, ఆయనపై కేసులు ఉన్నాయని నిందితులు చెప్పారు. ఆ తర్వాత వీడియోకాల్ చేసి మరింత భయాందోళనకు గురిచేశారు. తాము పోలీసులమని చెప్పి.. బాధితుడిని ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసుల నుంచి బయటపడాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిందేనని సైబర్ నేరగాళ్లు బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భయపడిపోయిన రిటైర్డ్ ఇంజినీర్.. వారు చెప్పిన విధంగా డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణలంకలోని కెనరా బ్యాంకు ద్వారా నాలుగు లావాదేవీల్లో రూ.10 కోట్లను నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు సమాచారం. ఇందులో బాధితుడు తన బ్యాంకు ఖాతాలోని ఫిక్స్డ్ డిపాజిట్ నగదును కూడా తీసి చెల్లించినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్లు చెల్లించిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు మరింత డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితుడు అందించిన వివరాల ఆధారంగా నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. రెండు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.7 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
కాగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు పోలీసు, కస్టమ్స్, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల పేర్లు ఉపయోగించి ప్రజలను భయపెట్టి డబ్బులు బదిలీ చేయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోకాల్‌లో పోలీసుల మాదిరిగా మాట్లాడటం, నకిలీ గుర్తింపు పత్రాలు లేదా కేసు పత్రాలు చూపించడం వంటి పద్ధతులతో బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియోకాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి.. కేసు నుంచి బయటపడేందుకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశించదు. ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే కాల్‌ను నిలిపివేసి సంబంధిత పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారులు సూచించారు.