బూర్గంపాడు, సెప్టెంబర్ 10: పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి..సూసైడ్ నోట్ రాసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో బెట్టింగ్ భూతానికి ఓ వ్యక్తి బలైన ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు లో మటన్ వ్యాపారం నిర్వహించే నాగేశ్వరరావు (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా బెట్టింగులకు పాల్పడి భారీగా డబ్బులు పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అశ్వరావుపేట మండలం ఆసుపాక కు చెందిన ఓ వ్యక్తి ప్రోత్బలంతో తాను బెట్టింగులకు పాల్పడ్డానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దీంతో భారీగా నష్టపోయానని, తన చావుకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తాను డబ్బులు పంపిన ఫోన్ పే నెంబర్లను వివరాలతో సహా మృతుడు సూసైడ్ నోట్ లో రాశాడు.
ఇవి కూడా చదవండి
గతంలో కూడా మృతుడు నాగేశ్వరరావు బెట్టింగుల కోసం చేసిన 80 లక్షల రూపాయల అప్పులను తండ్రి తీర్చినట్లుగా చెప్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తన భార్యకు ఫోన్ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తుండగా ఊరి శివారులో ఓ షెడ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.