కంపెనీలకు ప్రభుత్వం పన్ను రాయితీలు ఇచ్చినా.. ఆ లాభాలను ఉద్యోగులకు పంచడం లేదని, కొత్త ఉద్యోగాలు కల్పించడం, జీతాలు పెంచడంలో కార్పొరేట్ సంస్థలు వెనుకబడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కంపెనీలకు ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా.. ప్రతిఫలంగా ప్రజలకు, ఉద్యోగులకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గురువారం ఢిల్లీలో ఫిక్కీ (FICCI) 100వ వార్షికోత్సవ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలకు పన్నులు తగ్గించడం, సామాన్యులకు పన్ను ఊరట కల్పించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నా.. వాటికి తగ్గట్టుగా కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచడం, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కంపెనీలకు ప్రభుత్వం ఏం చేసింది?
కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. 2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను 2019లో 22 శాతానికి తగ్గించింది. మరోవైపు కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ కల్పించింది. దీంతో కంపెనీలకు ఎక్కువ లాభాలు మిగలాలి.. ప్రజల చేతుల్లో ఖర్చు చేసేందుకు ఎక్కువ డబ్బు ఉండాలి.. మార్కెట్లో డిమాండ్ పెరగాలి.. కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించాలి.. కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి.. ఉద్యోగుల జీతాలు పెంచాలి అనేది ప్రభుత్వ ఆశయం. కానీ కంపెనీలు మాత్రం పన్ను రాయితీలతో లాభపడుతున్నాయి తప్ప.. ఉద్యోగులకు ఆ ప్రయోజనాలు అందడం లేదన్నది మోదీ విమర్శ.
‘మీ ఆకలి తీరడం లేదా?’ అంటూ చురక
పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మోదీ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. “మీరు చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. ఎంత ఇచ్చినా మీ ఆకలి తీరదు. మీకు ఎంత పెట్టినా సరిపోదు” అంటూ వ్యాఖ్యానించారు.
కంపెనీలకు పన్నులు తగ్గించాం.. మరి ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అంటూ నిలదీశారు. “మోదీ ఏదో చేస్తాడు.. మనం చూస్తూ ఉందాం” అనే ధోరణిలో కంపెనీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
కంపెనీల లాభాలు భారీగా పెరుగుతున్నాయి.. మరి ఉద్యోగులకు ఏది?
భారతీయ కంపెనీల లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ అదే స్థాయిలో ఉద్యోగుల ఆదాయం పెరగడం లేదు.
– 2020-21లో కంపెనీల మొత్తం లాభాలు సుమారు రూ.2.5 లక్షల కోట్లుగా ఉండగా, 2024-25 నాటికి రూ.7.1 లక్షల కోట్లకు చేరాయి.
– 2025-26లో నిఫ్టీ-500 కంపెనీల లాభాలు దాదాపు రూ.18.1 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
– కంపెనీల లాభాలు పెరుగుతున్నా, ఉద్యోగుల జీతాలు మాత్రం దానికి తగ్గ స్థాయిలో పెరగడం లేదు.
అంటే కంపెనీల బిజినెస్ బాగుంది.. లాభాలు బాగున్నాయి.. కానీ ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాల్లో మాత్రం అదే స్థాయిలో మార్పు కనిపించడం లేదన్నది ప్రధాన విమర్శ.
ఉద్యోగాలు పెరిగినా.. నాణ్యమైన ఉద్యోగాలే ఎక్కడ?
దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగ రేటు 2017-18లో 6 శాతం ఉండగా, 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గింది. అయితే ఉద్యోగం దొరకడం వేరు.. మంచి జీతం, ఉద్యోగ భద్రత, PF, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ఉండే ఉద్యోగం దొరకడం వేరు. దేశంలో పనిచేస్తున్న వారిలో దాదాపు 87 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే చాలా మంది గిగ్ వర్క్, తాత్కాలిక పనులు, భద్రత లేని ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారు.
జీతాలు పెరిగాయా? వాస్తవానికి తగ్గాయి!
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత కొన్నేళ్లలో ఉద్యోగుల జీతాల కొనుగోలు శక్తి తగ్గింది.
– 2017-18 నుంచి 2023-24 మధ్య పురుష ఉద్యోగుల వాస్తవ నెలవారీ ఆదాయం 6.4 శాతం తగ్గింది.
– మహిళా ఉద్యోగుల ఆదాయం ఇదే కాలంలో 12.5 శాతం తగ్గింది.
– 2023-24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరిగితే.. ఉద్యోగుల సంఖ్య మాత్రం కేవలం 1.5 శాతమే పెరిగింది.
అంటే కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నా.. ఉద్యోగుల ఆదాయం, ఉద్యోగ అవకాశాలు అదే స్థాయిలో పెరగడం లేదు.
మోదీ ఆశిస్తున్నదేంటి?
ప్రభుత్వం పన్నులు తగ్గించింది.. వ్యాపారాలకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాని కోరుతున్నారు.
ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి.. ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోళ్లు పెరుగుతాయి.. మార్కెట్ బలపడుతుంది.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన.
సింపుల్‌గా చెప్పాలంటే.. కంపెనీలకు పన్ను రాయితీలు, వ్యాపార అవకాశాలు కల్పించినప్పుడు.. అవి తమ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగుల జీతాలు పెంచడం, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆ ప్రయోజనాలను ప్రజలకు కూడా అందించాలి. కంపెనీలు లాభపడుతున్నాయి.. మరి ఆ లాభాల్లో ఉద్యోగులకు వాటా ఎక్కడ? అన్నదే మోదీ తాజా ప్రశ్న.