Headlines

పచ్చి చేపలు vs ఎండు చేపలు.. మీ ఆరోగ్యానికి ఏవి మంచివి..? ఈ నిజాలు తెలుసుకోండి..


నాన్‌వెజ్ ప్రియుల డైట్‌లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొందరు మార్కెట్ నుంచి అప్పటికప్పుడు తాజా పచ్చి చేపలను తెచ్చుకుని వండుకుంటే, మరికొందరు ఘుమఘుమలాడే ఎండు చేపల వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. ఈ రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి గుణగణాలు, శరీరానికి చేకూరే ప్రయోజనాలపై పోషకాహార నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజా పచ్చి చేపల్లో సహజసిద్ధమైన తేమతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, నాణ్యమైన లీన్ ప్రొటీన్ మెండుగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. కంటిచూపు మందగించకుండా కాపాడతాయి. ముఖ్యంగా పచ్చి చేపల్లో సహజంగానే ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీటి మాంసం మృదువుగా ఉండటంతో త్వరగా జీర్ణమై ఎలాంటి కడుపు సమస్యలు రాకుండా చేస్తుంది. అందువల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారికి పచ్చి చేపలు ఉత్తమమైన ఆహారంగా నిలుస్తాయి.

ఎండుచేపలు

ఇక ఎండబెట్టిన చేపల విషయానికి వస్తే, ఎండబెట్టే ప్రక్రియలో నీటి శాతం ఆవిరైపోయి ప్రొటీన్, ఐరన్, కాల్షియం సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న ముళ్లు ఉండే ఎండు చేపలను తినడం వల్ల శరీరానికి మంచి కాల్షియం అంది ఎముకలు బలంగా మారతాయి. అయితే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ప్రాసెసింగ్ సమయంలో భారీ మోతాదులో ఉప్పును చేరుస్తారు. ఈ అధిక ఉప్పు శరీరంలో రక్తపోటును అమాంతం పెంచే ప్రమాదం ఉంది. అందుకే హైబీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా వీటి స్వభావం గట్టిగా ఉండటం వల్ల జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గుండె, మెదడు ఉత్తేజితంగా పనిచేయడానికి తాజా పచ్చి చేపలే బెస్ట్ ఆప్షన్. ఎండు చేపలను ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు కేవలం రుచి కోసం అప్పుడప్పుడు పరిమితంగా తీసుకోవచ్చని, రోజువారీ పోషణ కోసం మాత్రం తాజా చేపలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *