Headlines

నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన సంచలన విషయాలు..


ఓవర్సీస్ కెరీర్, స్పాన్సర్‌షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి బురిడీ కొట్టించిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. లండన్ కేంద్రంగా నెట్‌వర్క్ నడిపిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్రిటన్‌లో ఉద్యోగంతో పాటు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ స్థానికుడు శివక్రాంతికుమార్ నుంచి ఏకంగా రూ.15 లక్షలు కాజేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో అసలు వ్యవహారం వెలుగుచూసింది. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను డిటైన్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు.

అంతా ఆయనే చేశారు..

పోలీసుల విచారణలో భాగంగా డెస్టినీ కన్సల్టెన్సీ ఆర్థిక లావాదేవీలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వివరాలపై ఆరా తీయగా.. సంస్థ నడిపేది తన భర్త మధుకర్, ఖాతాల వ్యవహారాలు చూసేది అకౌంటెంట్ మాత్రమేనని, ప్రచారానికి మించి తనకు అంతర్గత వ్యవహారాలు తెలియవని నందన తప్పించుకునే ప్రయత్నం చేశారు. నాలుగు గంటల విచారణలో పలు సాంకేతిక అంశాలకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అసంతృప్తి చెందిన అధికారులు, ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

వెలుగులోకి వస్తున్న మరిన్ని మోసాలు

రమానందన పోలీసుల విచారణకు వచ్చిన విషయం తెలియడంతో అద్దంకి ప్రాంతానికి చెందిన పలువురు నిరుద్యోగులు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. తమ నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసి మోసం చేశారని స్టేషన్ ఆవరణలోనే వాపోయారు. అటు కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులతో ఆమె న్యాయ బృందం అనుచితంగా ప్రవర్తించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు న్యాయవాదులు క్షమాపణ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా బాధితులుగా మారిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *