Headlines

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు, 75 కి.మీ వేగంతో గాలులు!


విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని తాకింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 6 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వాయుగుండం బుధవారం అర్ధరాత్రి సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు అధికారులు వెల్లడించారు. 3 గంటల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తీవ్ర వాయుగుండం విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంతకుముందు IMD అంచనా వేసింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. IMD కూడా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేసింది.

విశాఖలో భారీ వర్ష సూచన

తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

60–75 కిలోమీటర్ల వేగంతో గాలులు

తీరం దాటే సమయంలో, ఆ తర్వాత కూడా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు. IMD బులెటిన్‌లో ఉత్తరాంధ్ర తీరంలో 30–35 నాట్స్ గాలులు, గంటకు 40 నాట్స్ వరకు గాలివానల వేగం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు. కీలకమైన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *