ఫీల్డ్ స్పాట్: పుచ్చకాయ కొనేటప్పుడు గమనించాల్సిన అతి ముఖ్యమైన గుర్తు దాని మీద ఉండే మచ్చ. ప్రతి పుచ్చకాయ నేల మీద పడుకుని పెరుగుతుంది. నేలకు తగిలే భాగం ఎండ తగలక తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది.ఆ మచ్చ ముదురు పసుపు లేదా బంగారు రంగులో ఉంటే అది చెట్టు మీద పూర్తిస్థాయిలో పండిందని, చాలా తియ్యగా ఉంటుందని అర్థం. మచ్చ తెల్లగా ఉంటే అది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోసేశారని అర్థం. అలాంటి కాయలు అస్సలు తియ్యగా ఉండవు.
వెబ్బింగ్: పుచ్చకాయ తొక్క పైన అప్పుడప్పుడు గోధుమ రంగులో సాలీడు గూడులాంటి మచ్చలు కనిపిస్తాయి. చాలామంది ఇవి చూసి కాయ పాడైందేమో అనుకుంటారు. కానీ అసలు రహస్యం ఏంటంటే.. ఆ పుచ్చకాయ పువ్వుగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎన్ని ఎక్కువ సార్లు పరాగసంపర్కం చేస్తే, ఆ కాయకు అన్ని ఎక్కువ మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా ఉన్న కాయలు చాలా తియ్యగా ఉంటాయి.
ఆడ పుచ్చకాయలే తియ్యగా: పుచ్చకాయల్లో మగ, ఆడ అని రెండు రకాలు ఉంటాయని మీకు తెలుసా? మగ పుచ్చకాయలు పొడవుగా, కోల ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. ఆడ పుచ్చకాయలు గుండ్రంగా, బంతిలా ఉంటాయి. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి తీపి కావాలనుకునే వారు గుండ్రటి కాయలనే ఎంచుకోవాలి.
శబ్దాన్ని బట్టి తీపి: పుచ్చకాయను వేళ్లతో తట్టినప్పుడు వచ్చే శబ్దం దాని లోపలి స్థితిని చెబుతుంది. కాయను కొట్టినప్పుడు డబ్ డబ్ అని డొల్లగా శబ్దం వస్తే అది బాగా పండినట్లు. శబ్దం గట్టిగా లేదా మందంగా వస్తే అది ఇంకా పచ్చిగా ఉందని లేదా లోపల గట్టిగా ఉందని అర్థం. తొక్క నిగనిగలాడుతూ మెరిసిపోతుంటే అది ఇంకా పండలేదని అర్థం. బాగా పండిన కాయ తొక్క కొంచెం డల్‌గా ఉంటుంది
కాండం – బరువు: పుచ్చకాయ కాండం లేదా తొడిమ పచ్చగా ఉంటే అది పండక ముందే కోసినట్లు. అది పూర్తిగా ఎండిపోయి ఉంటేనే సహజంగా పండినట్లు లెక్క. అదే సైజులో ఉన్న రెండు కాయలను తీసుకుని చూస్తే, ఏది ఎక్కువ బరువుగా ఉందో దాన్నే ఎంచుకోండి. బరువు ఎక్కువగా ఉందంటే అందులో చక్కెర శాతం, రసం నిండుగా ఉన్నాయని అర్థం.




