Headlines

ఢిల్లీ నిరసనలకు పాకిస్తాన్ భారీ కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..!

ఢిల్లీ నిరసనలకు పాకిస్తాన్ భారీ కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..!


దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలను ఆసరాగా చేసుకుని, దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రను ఢిల్లీ పోలీసులు బహిర్గతం చేశారు. ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆధారిత సోషల్ మీడియా హ్యాండిల్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

జంతర్ మంతర్ వద్ద ‘కాక్రూచ్ జనతా పార్టీ (CJP)’ చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న 480కి పైగా పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలను గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం (జూలై 23) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.. “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వదంతులు, మార్ఫింగ్ చేసిన వీడియోలు, నకిలీ పోస్టులను ప్రచారం చేస్తున్న 480కి పైగా పాక్ ఖాతాలను గుర్తించాము. ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభం నుండి కూడా ఈ ఖాతాలే చురుకుగా ఉంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. మేము వెంటనే చర్యలు చేపట్టి ఆ ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నాము” అని వెల్లడించారు.

విద్యార్థులకు, ప్రజలకు పోలీసుల కీలక విజ్ఞప్తి

ధృవీకరించని, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం ద్వారా విద్యార్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఈ పాకిస్తాన్ ఖాతాల ప్రధాన లక్ష్యమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలు, అనామక హ్యాండిల్స్ నుండి వచ్చే సమాచారాన్ని చూసి విద్యార్థులు రెచ్చగొట్టబడవద్దని పోలీసులు కోరారు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్‌ను ఫార్వార్డ్ లేదా షేర్ చేసే ముందు ప్రామాణికతను, వాస్తవాలను సరిచూసుకోవాలని (Fact-Check) సూచించారు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారవద్దని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

శాంతియుత నిరసనలకు ప్రాధాన్యం

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు పౌరులకు ఉందని, ఢిల్లీ పోలీసులు ఆ హక్కును ఎల్లప్పుడూ గౌరవిస్తారని సదరు అధికారి స్పష్టం చేశారు. అయితే, నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే యత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంతతను పాటిస్తూ, శాంతిని కాపాడటంలో చట్ట అమలు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ పోలీస్ వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *