Headlines

చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..

చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..


బొద్దింకలను చూస్తే భయపడేవారు లేదా అసహ్యించుకునేవారు కోకొల్లలు. కానీ బతికున్న బొద్దింకల కంటే చనిపోయిన బొద్దింకలే అత్యంత ప్రమాదకరమని.. అవి చనిపోయాక ఒక రకమైన విష వాయువు విడుదల చేస్తాయని వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇటీవల బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్, స్టోరీ టెల్లర్ వెర్నన్ జూనియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘‘బతికున్న బొద్దింకల వల్ల నాకు ఎలాంటి అలర్జీ లేదు.. కానీ చనిపోయిన బొద్దింకలు విడుదల చేసే ఒకానొక గ్యాస్ వల్ల నాకు తీవ్రమైన అలర్జీ వస్తుంది’’ అంటూ వెర్నన్ తన వీడియోలో తెలిపారు. దీనికి చికిత్స తీసుకుంటున్న సమయంలో వ్యాక్సిన్ డోస్ ఎక్కువై ప్రాణాంతక స్థితికి కూడా వెళ్లినట్లు ఆయన చెప్పారు. అందుకే బొద్దింకలకు మా ఇల్లే అత్యంత సురక్షితమైన ప్రదేశం.. ఎందుకంటే నేను వాటిని చంపలేను కదా అంటూ నవ్వులు పూయించారు. అయితే కామెడీగా చెప్పినప్పటికీ.. చనిపోయిన బొద్దింకల వల్ల నిజంగానే అంత ప్రమాదం ఉందా? అవి ఏమైనా గ్యాస్ విడుదల చేస్తాయా? అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి.

డెత్ గ్యాస్ ప్రచారం నిజమేనా?

ఈ విషయంపై శార్దా కేర్ హెల్త్‌సిటీ, పల్మోనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ వర్మ స్పష్టత ఇచ్చారు. బొద్దింకలు చనిపోయాక ఎలాంటి మర్మమైన లేదా విచిత్రమైన వాయువులను విడుదల చేయవని ఆయన కొట్టిపారేశారు. ‘‘బతికున్నా, చనిపోయినా బొద్దింకల వల్ల అలర్జీలు రావచ్చు. బొద్దింకలు వదిలే విసర్జకాలు, లాలాజలం, వాటి శరీరం నుండి ఊడిపడే చర్మం వంటి వాటిలో ఉండే ప్రోటీన్లు ఇంటి ధూళితో కలసి గాలిలో వ్యాపిస్తాయి. చనిపోయిన బొద్దింకల భాగాలు నలిగిపోయి సన్నని కణాలుగా మారి గాలిలో కలిసిపోతాయి. వాటిని పీల్చినప్పుడు అలర్జీ వస్తుంది తప్ప, అవేమీ ప్రత్యేకమైన గ్యాస్‌ను విడుదల చేయవు’’ అని డాక్టర్ హరీష్ వర్మ తెలిపారు.

ఎంతవరకు ప్రమాదకరం?

పట్టణ ప్రాంతాల్లో, పరిశుభ్రత తక్కువగా ఉండే చోట్ల, తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఈ కాక్రోచ్ అలర్జీ చాలా సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు.

ముఖ్య లక్షణాలు

సాధారణ లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు దురద పెట్టడం, చర్మంపై దద్దుర్లు, దగ్గు, తేలికపాటి ఆయాసం.

తీవ్రమైన లక్షణాలు: శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, గుండెల్లో బరువుగా అనిపించడం, పెదవులు నీలంగా మారడం, తల తిరగడం, ముఖం లేదా గొంతు వాపు.

తక్షణమే ఏం చేయాలి?

  • అలర్జీ వ్యాపించిన ప్రదేశం నుండి వెంటనే పక్కకు వెళ్లాలి.
  • అస్తమా బాధితులు వైద్యులు సూచించిన ఇన్‌హేలర్‌ను వెంటనే వాడాలి.
  • శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడితే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.
  • ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, తేమ లేకుండా చూసుకోవడమే దీనికి ఉత్తమ మార్గం.

అయితే చనిపోయిన బొద్దింకల గ్యాస్ అనేది వినడానికి సరదాగా అనిపించినప్పటికీ, బొద్దింకల వల్ల వచ్చే అలర్జీలు మాత్రం నిజమైనవి. అస్తమా ఉన్నవారు దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *