Headlines

గణపయ్య భక్తులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్.. వినాయక మండపాలకు ఉచిత కరెంట్!


వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అలాగే గణేష్ చతుర్థిసందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్..

అందుబాటులో తాత్కాలిక కనెక్షన్లు

అలాగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తాత్కాలిక కనెక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. మండపాల నిర్వాహకులు సమీపంలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాలు, మీ-సేవ కేంద్రాలతో పాటు ఏపీసీపీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఈ నెల 26వ తేదీ వరకు మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.100 ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. 500 వాట్ల వినియోగానికి రూ.1,000, 1,000 వాట్ల సామర్థ్యానికి రూ.2,250 అధికారిక రుసుముగా వసూలు చేయనున్నట్లు తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగానే అనుమతులు తీసుకుని అధికారిక కనెక్షన్ పొందాలని అధికారులు సూచించారు.

అక్రమ కనెక్షన్లపై చర్యలు

మెయిన్ లైన్ల నుంచి నేరుగా విద్యుత్ తీసుకోవడం, అనధికారిక కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎండీ పుల్లారెడ్డి హెచ్చరించారు. అక్రమ విద్యుత్ వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలు రంగంలోకి దిగనున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *