Headlines

కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్‌వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!


అన్నమయ్య జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. కురబలకోట మండలం అంగళ్లు అవుట్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. సుమారు నాలుగేళ్ల క్రితం కురబలకోట మండలం శ్రీరాములపల్లికి చెందిన నరేష్‌తో ఆమెకు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. నరేష్ సీరియల్స్‌లో నటిస్తున్నానంటూ తరచూ హైదరాబాద్‌కు వచ్చేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని యువతి పేర్కొంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నరేష్‌కు ఫైనాన్స్ ద్వారా కారు కొనిచ్చినట్లు, అదేవిధంగా దాదాపు రూ.40 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపింది.

అయితే ఏడాది క్రితం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నరేష్ మోసం చేశాడని యువతి ఆరోపిస్తోంది. అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోరాడుతున్నట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజాగా నరేష్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదుపై ఏడాదిగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అంగళ్లు అవుట్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె మదనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *