కర్నూల్, ఏప్రిల్ 20: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఉన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం (ఏప్రిల్ 19) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం..
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌కు చెందిన బోయ బెలగల్ రామయ్య, నరసమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వీరి పెద్ద కుమార్తె శాంతికి ఇటీవల వివాహం జరిపించారు. రామయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రామయ్య డబ్బు కోసం తరచూ భార్య నరసమ్మను వేధించేవాడు. భర్త వేదింపులు తాళలేక నరసమ్మ చిన్న కుమార్తె, కుమారుడిని తీసుకుని పెద్దతుంబుళంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పెద్దకుమార్తె శాంతి ప్రసవం కోసం నరసమ్మ వద్దకు వచ్చింది. శనివారం ఉదయం శాంతికి పురిటి నొప్పులు రావడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఆడబిడ్డ జన్మించింది. దీంతో కూతురికి, మనవరాలికి సపర్యలు చేస్తూ ఆస్పత్రిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామయ్య ఆదివారం మధ్యాహ్నం ఫూటుగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు.
భార్య దగ్గరకు వచ్చి తనతో కాపురానికి రావాలని గొడవపడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో బయటకు వెళ్లి సాయంత్రం మళ్లీ ప్రభుత్వాస్పత్రికి వచ్చి అందరూ చూస్తుండగానే కత్తితో భార్యను పొడిచాడు. కడుపులో, ఛాతీ భాగంలో బలంగా పొడవడంతో నరసమ్మ తీవ్ర రక్తస్రావమై కుప్పకూలింది. దీంతో అక్కడి జనాలు భయంతో కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. అక్కడి వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ నరసమ్మ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.