ఓట్ల వర్షం.. తమిళనాడు, బెంగాల్‌లో రికార్డ్ పోలింగ్.. గెలుపుపై పార్టీల్లో ఉత్కంఠ..

ఓట్ల వర్షం.. తమిళనాడు, బెంగాల్‌లో రికార్డ్ పోలింగ్.. గెలుపుపై పార్టీల్లో ఉత్కంఠ..


తమిళనాడు రాజకీయ చరిత్రలో రికార్డు పోలింగ్ నమోదైంది.శాసనసభ ఎన్నికల పోలింగ్‌లో అక్కడి ఓటర్లు చైతన్యాన్ని చాటుతూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సాయంత్రం 6:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84.51 శాతం పోలింగ్ నమోదయింది. 1952లో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి తమిళనాడులో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. 1952 నుండి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఇంత భారీ సంఖ్యలో పాల్గొనడం వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. తొలిసారి ఓటు వేస్తున్న యువత ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న హోరాహోరీ పోరు ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించింది. ఓటు హక్కుపై ప్రజల్లో పెరిగిన అవగాహన, క్షేత్రస్థాయిలో జరిగిన ప్రచారం ఈ రికార్డు స్థాయి పోలింగ్‌కు దోహదపడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు స్వచ్ఛందంగా తరలిరావడం విశేషం.

జిల్లాల వారీగా సందడి

సాయంత్రం 6 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం.. గ్రామీణ నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా డెల్టా జిల్లాల్లో ఓటింగ్ శాతం 85 దాటినట్లు సమాచారం. చెన్నై వంటి నగరాల్లో కూడా గతంతో పోలిస్తే గణనీయమైన మార్పు కనిపించింది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రతీ ఒక్కరు ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  2016 ఎన్నికలతో పోలిస్తే తమిళనాడులో 11 శాతం అధికంగా పోలింగ్‌ నమోదమయ్యింది. మరోవైపు సీఎం అభ్యర్ధులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదయ్యింది. సీఎం స్టాలిన్‌ పోటీ చేసిన కొలతూరులో 85.6 శాతం పోలింగ్‌ , విజయ్‌ పోటీ చేస్తున్న పెరంబూరులో 89.1 శాతం ,
పళనిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడిలో 91.4 శాతం పోలింగ్‌ నమోదయ్యింది

రాజకీయ సమీకరణాలపై ప్రభావం

ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా భారీ పోలింగ్ నమోదైతే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని లేదా సంక్షేమ పథకాల పట్ల ప్రజల మొగ్గు అని విశ్లేషకులు భావిస్తారు. ఏది ఏమైనా,ఓటర్ల తీర్పు ఈసారి తమిళ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది.

అటు బెంగాల్లోనూ రికార్డు..

అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో 2026 నాటి పోలింగ్ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 2011లో నమోదైన 84 శాతం ఓటింగ్‌ను తిరగరాశారు.2016లో 82.66 శాతం, 2021లో 81.56 శాతంగా ఉన్న ఓటింగ్ సరళిని పక్కకు నెట్టేసి, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ శాతం ఏకంగా 90 శాతానికి చేరుకోవడం విశేషం. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఓటర్లు ప్రభంజనం సృష్టించారు. ఒక్క కూచ్ బెహార్‌లోనే అత్యధికంగా 92.07 శాతం ఓటింగ్ నమోదు కాగా జల్‌పైగురిలో 91.2 శాతం, ఉత్తర దినాజ్‌పూర్‌లో 89.74 శాతం, అలీపుర్‌దువార్‌లో 88.74 శాతం, డార్జిలింగ్‌లో 86.49 శాతం, కాలింపాంగ్‌లో 81.98 శాతంగా పోలింగ్ నమోదై ప్రజాస్వామ్య పండుగను శిఖరాగ్రానికి చేర్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *