గ్యాస్ వినియోగం – అసలు లెక్క: ఒక కిలో ఎల్పిజి గ్యాస్‌లో సుమారు 46.1 మెగాజౌల్స్ శక్తి ఉంటుంది. గ్యాస్ స్టవ్‌పై ఉండే ఒక బర్నర్ సగటున గంటకు 7 MJ శక్తిని వాడుతుంది. అంటే మీరు ఒకేసారి రెండు బర్నర్లను వెలిగిస్తే, గంటకు సుమారు 14 MJ శక్తి ఖర్చవుతుంది. బరువు లెక్కన చూస్తే.. రెండు బర్నర్లు కలిపి గంటకు సుమారు 0.30 కిలోల గ్యాస్‌ను వినియోగిస్తాయి.
సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది?: ఈ లెక్క ప్రకారం.. ఒక 14.2 కిలోల సిలిండర్‌ను ఆపకుండా నిరంతరాయంగా వాడితే అది సుమారు 46 గంటల పాటు మండుతుంది. అయితే మన ఇళ్లలో రోజుకు కొన్ని గంటలు మాత్రమే వంట చేస్తాం కాబట్టి కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వంట అలవాట్లను బట్టి ఒక సిలిండర్ కొన్ని వారాల నుండి నెలల వరకు వస్తుంది.
పొదుపుగా వాడటం ఎలా?: గ్యాస్ ఆదా చేయడంలో వంట చేసే పద్ధతి కీలక పాత్ర పోషిస్తుంది. వంట చేసేటప్పుడు పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలి. దీనివల్ల వేడి ఆవిరైపోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. అలాగే పప్పులు లేదా తృణధాన్యాలను వండటానికి గంట ముందే నానబెట్టడం వల్ల వంట సమయం తగ్గి, గ్యాస్ చాలా వరకు పొదుపు అవుతుంది.
బర్నర్ల ఎంపిక – నిర్వహణ: స్టవ్‌పై ఉండే పెద్ద బర్నర్ల కంటే చిన్న బర్నర్లు తక్కువ గ్యాస్‌ను వాడుతాయి. కాబట్టి రోజువారీ వంటకు చిన్న బర్నర్‌ను ఉపయోగించడం మంచిది. అలాగే బర్నర్లను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగ్గా రాదు, దీనివల్ల గ్యాస్ వృధా అవ్వడమే కాకుండా వంట ఆలస్యమవుతుంది.
అవగాహనతో ఇంధన ఆదా: అనవసరంగా ఎక్కువ మంట పెట్టకుండా, అవసరానికి తగినట్లుగా మంటను అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చు. గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన పెంచుకుని, ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంటి సిలిండర్ మరికొన్ని రోజులు అదనంగా రావడమే కాకుండా మీ జేబుపై భారం కూడా తగ్గుతుంది.




