బలగం సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వేణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దేవిశ్రీ ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని ఆయన వెల్లడించారు. దాదాపు 25 ఏళ్లుగా తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్న దేవిశ్రీ.. నటుడిగా కూడా తనదైన ముద్ర వేయబోతున్నారని వేణు అభిప్రాయపడ్డారు. సినిమాలో ఆయన నటన చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామీణ వాతావరణం, సహజమైన భావోద్వేగాలు ప్రధానంగా సాగేలా ‘ఎల్లమ్మ’ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ సుమారు 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక ప్రాంతం గండికోటలో మూడు రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కథకు అనుగుణంగా సహజమైన లొకేషన్లను ఎంపిక చేస్తూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పార్సి అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. సంగీత ప్రపంచంలో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీ.. నటుడిగా ఎలాంటి ప్రభావం చూపిస్తారనే ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకునే లక్ష్యంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బలగంతో భావోద్వేగభరితమైన కథను ప్రేక్షకులకు అందించిన వేణు యెల్దండి.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ నటనపై దర్శకుడు వ్యక్తం చేసిన నమ్మకం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి