మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం గొర్రెలను మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తి, అదృశ్యమైన రెండు రోజుల తర్వాత గ్రామ చెరువులో విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాల గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఎప్పటిలాగే ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో తన గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళాడు. అయితే, సాయంత్రం చీకటి పడినా బాబు ఇంటికి తిరిగి రాలేదు..
దీంతో ఆందోళన చెందిన భార్య మంజుల, ఇతర కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, పొలాలు, బంధువుల ఇళ్ల వద్ద తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు.
చెరువులో మృతదేహం లభ్యం
రెండు రోజుల పాటు ఆచూకీ లేకుండా పోయిన బాబు, గ్రామ చెరువులో శవమై తేలాడు. ఉదయాన్నే చెరువు వైపు వెళ్లిన గ్రామస్తులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య మంజుల, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ ఘటనపై మృతుడి భార్య మంజుల కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.