సాధారణంగా జాతీయ రహదారులపై వాహనాలు అత్యంత వేగంతో దూసుకెళ్తుంటాయి. కానీ, విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతానికి రాగానే వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేస్తున్నారు. రోడ్డు పక్కన కనిపిస్తున్న ఒక వింత దృశ్యాన్ని చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.. అంతా అక్కడ ఎందుకు ఆగుతున్నారనేది చూస్తే.. రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ రావి చెట్టు కొమ్మల నిండా మామిడికాయలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఆది చూసిన జనాలు ఏంటీ వింతా అని ఒక్కసారిగా ఆగిపోతున్నారు.
మొదట ఈ దృశ్యాన్ని చూసిన వారు రావి చెట్టుకు మామిడి కాయలు కాయడం ఏంటి? అని ఆశ్చర్యపోతూ దగ్గరకు వెళ్తున్నారు. అయితే, నిశితంగా గమనిస్తే అసలు విషయం బోధపడింది. అది ప్రకృతి వింత కాదు, ఒక సామాన్య వ్యాపారి చేసిన అసాధారణ ఆలోచన అని. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఓ చిరు వ్యాపారి, మామిడి కాయలను దారాలతో రావి చెట్టు కొమ్మలకు అందంగా వేలాడదీశాడని.
సక్సెస్ అయిన మార్కెటింగ్ ట్రిక్
కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ వ్యాపారి చేసిన ఆలోచన సూపర్ సక్సెస్ అయింది. వ్యాపార ప్రకటనల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే ఈ రోజుల్లో కేవలం తన తెలివితోనే ఈ వ్యాపారి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైవేపై వెళ్లేవారు ఆగి మరీ ఈ మామిడి రావి చెట్టును చూస్తున్నారు. కేవలం చూడటమే కాదు అతని మార్కెటింగ్ స్టార్టజీకి సలాం కోట్టి చాలామంది మామిడి పండ్లను కూడా కొనుగోలు చేస్తున్నారు.
నెటిజన్ల రియాక్షన్
అక్కడికి వచ్చిన వారు ఈ వింతను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. ఇది చూసిన చాలా మంది వ్యాపారం అంటే కేవలం వస్తువులను అమ్మడమే కాదు, జనాలను ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలియాలి అంటున్నారు. ఎలాంటి ఖరీదైన యాడ్స్ లేకుండానే ఒక చిన్న ఆలోచనతో తన వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తున్న అతని క్రియేటివ్ మామూలుగా లేదుగా అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.