Headlines

ఇంటర్ విలీనంతో కీలక మార్పులు.. 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా? ఉండవా?


హైదరాబాద్‌, నవంబర్‌ 24: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇకపై ఇంటర్మీడియట్‌ను 11, 12వ తరగతులుగా పిలవనున్న నేపథ్యంలో.. 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎక్కువ మంది 11వ తరగతికి బోర్డు పరీక్షలు వద్దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత పరీక్షల విధానంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విలీనానికి సంబంధించిన ముసాయిదా నివేదికను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినప్పుడు ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు.

11వ తరగతికి బోర్డు పరీక్షలు ఎందుకు వద్దంటున్నారు?

10, 11, 12వ తరగతులకు వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకే 11వ తరగతికి బోర్డు పరీక్షలను తొలగించాలని సూచిస్తున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి విద్యా విధానాల్లో 11వ తరగతికి ప్రత్యేక బోర్డు పరీక్షలు ఉండవు. అయితే పాఠశాల స్థాయిలో అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణ విద్యాకమిషన్‌ కూడా 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసి, ఆ సంవత్సరంలో విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కల్పించడం, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. చదువు అనేది కేవలం పరీక్షలు, మార్కుల కోసమే కాకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలన్నది ఈ వాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇదే తరహాలో తమిళనాడు ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది.

11వ తరగతికి పరీక్షలు ఎందుకు ఉండాలంటున్నారు?

మరోవైపు 11వ తరగతికి బోర్డు పరీక్షలు తప్పనిసరిగా ఉండాలని కొందరు విద్యావేత్తలు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలను మినహాయిస్తే.. సాధారణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సగటు హాజరు 65 శాతానికి మించడం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా పరిమితంగానే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేకపోతే విద్యార్థుల హాజరు మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ పెరగడంతో పాటు, ఉత్తీర్ణత సాధించిన తర్వాత 12వ తరగతిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి



రెండేళ్ల సిలబస్‌పై ప్రభావం పడుతుందా?

పదో తరగతితో పోలిస్తే ఇంటర్మీడియట్ స్థాయిలో పాఠ్యాంశాల పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. 11వ తరగతిలో నేర్చుకున్న అంశాలే 12వ తరగతికి పునాదిగా నిలుస్తాయి. మొదటి ఏడాది పాఠ్యాంశాలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే రెండో ఏడాది చదువులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలు రెండేళ్ల సిలబస్ ఆధారంగా జరుగుతాయి. కాబట్టి 11వ తరగతిలోనే విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలిస్తే ఫస్టియర్, సెకండియర్ ఉత్తీర్ణత శాతాల్లో తేడా కనిపిస్తోంది. మార్చి పరీక్షల్లో సెకండియర్ జనరల్ విభాగంలో 75.61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఫస్టియర్ జనరల్ విభాగంలో 66.94 శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఈ నేపథ్యంలో 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేకపోతే విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బోర్డు పరీక్షలు లేకుంటే కొన్ని కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులకు సాధారణ విద్యాబోధన కంటే జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల శిక్షణకే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా 11వ తరగతి పరీక్షల విధానంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశంపై నిపుణులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనే విషయంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *