Headlines

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? డిస్కౌంట్‌ చూసి ఆర్డర్‌‌ చేస్తే పప్పులో కాలేసినట్టే


ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? డిస్కౌంట్‌ చూసి ఆర్డర్‌‌ చేస్తే పప్పులో కాలేసినట్టే

బ్రాండెడ్ వస్తువులు సగం ధరకే వస్తున్నాయనే ప్రకటన కనిపిస్తే చాలు.. చాలామంది వెంటనే లింక్‌పై క్లిక్ చేస్తున్నారు. 99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ అంటూ వచ్చే ప్రకటనలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. కానీ ఆ లింక్ వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉండొచ్చు. కార్డు వివరాలు, యూపీఐ చెల్లింపుల ద్వారా క్షణాల్లో డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.

నకిలీ ప్రకటనలతో సైబర్ వల

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలను నమ్మే ముందు జాగ్రత్త అవసరం. ప్రముఖ బ్రాండ్ల పేరుతో 80 నుంచి 90 శాతం తగ్గింపులు అంటూ నకిలీ లింకులు పంపుతుంటారు. వాటిపై క్లిక్ చేస్తే అసలైన ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ పేజీ తెరుచుకుంటుంది. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు నమోదు చేస్తే ఖాతాలోని డబ్బు మాయం కావచ్చు. కొన్ని సందర్భాల్లో డబ్బు చెల్లించిన తర్వాత వస్తువు రాకపోవచ్చు. వచ్చినా నాణ్యత లేని నకిలీ వస్తువు, పాత సామాను పంపించి మోసగాళ్లు తప్పించుకుంటారు. అందుకే అనుమానాస్పద ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వస్తువులు కొనాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించడం మంచిది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే గుర్తుతెలియని లింకులను తెరవకపోవడమే సురక్షితం. వెబ్‌సైట్ చిరునామాలో ‘https://’ ఉందా? పేరు, అక్షరాల కూర్పు సరిగ్గా ఉందా? అనే విషయాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి. మార్కెట్ ధరతో పోలిస్తే అసాధారణంగా తక్కువ ధర కనిపిస్తే వెంటనే నమ్మకండి. కొత్త లేదా అనుమానాస్పద వెబ్‌సైట్లలో ముందస్తుగా యూపీఐ, కార్డు చెల్లింపులు చేయకుండా ఉండటం మంచిది. అవకాశం ఉంటే నగదు చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. చిన్న అనుమానం వచ్చినా ఆ ఆర్డర్‌ను వదిలేయడమే ఉత్తమం. అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి మనకు రక్షణ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *