Headlines

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్‌జీ కోసం సరికొత్త వ్యూహాలు..


How Gamified Learning Can Make Finance Fun For Gen ZImage Credit source: AI Image

మన దేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంచడం అంటే కేవలం ఎస్‌ఐపీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో పుస్తకాల్లోనో, క్లాస్‌రూమ్‌లలోనో బోధించడం కాదు. అసలైన సవాలు ఏమిటంటే.. యువత వాటిపై ఆసక్తి చూపేలా చేయడం. ప్రస్తుతం యువతరం కంటెంట్ చూసే విధానం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఫైనాన్స్ పాఠాలను కూడా సరికొత్త రీతిలో అందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాల్లో 52 శాతానికి పైగా వయోజనులకు ఆర్థిక విషయాలపై అవగాహన ఉండగా, భారతదేశంలో అది కేవలం 27 శాతానికే పరిమితమైంది. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న జెన్ జీ, యువతరం అవసరాలకు తగినట్లు సరికొత్త పద్ధతులు అవలంబిస్తేనే ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

గేమిఫైడ్ లెర్నింగ్: ఆడుతూ పాడుతూ ఆర్థిక పాఠాలు

సంప్రదాయ తరగతి గది పద్ధతులు, కఠినమైన నిర్వచనాల స్థానంలో గేమిఫైడ్ లెర్నింగ్ వైపు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఫైనాన్స్ అనేది అంత కష్టమైనదేమీ కాదు, మనం దాన్ని వివరించే పద్ధతే క్లిష్టంగా ఉంటుంది. కేవలం కాన్సెప్ట్‌లను బట్టీ పట్టించడం కాకుండా విద్యార్థులు నిజ జీవిత పరిస్థితులను అనుభవించేలా చేయాలి’’ అని ఇండియాస్ ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ వ్యవస్థాపకురాలు, సీఈవో మహెక్ తోమర్ తెలిపారు. పొదుపు, పెట్టుబడుల గురించి కేవలం పాఠాలు చెప్పడం కంటే.. పరిమిత బడ్జెట్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పోటీ ప్రాధాన్యతలు వచ్చినప్పుడు దేన్ని ఎంచుకోవాలి అనే వాస్తవ పరిస్థితుల సిమ్యులేషన్ ద్వారా తేలికగా అర్థమవుతుందని ఆమె వివరించారు. గేమిఫికేషన్ అంటే డబ్బును ఆటగా మార్చడం కాదని, తప్పులు చేసి వాటి పర్యవసానాల నుంచి నేర్చుకునే సురక్షితమైన వేదికను కల్పించడమేనని స్పష్టం చేశారు.

ఓటీటీలు, రియాలిటీ షోలలోనూ అవగాహన

ఆర్థిక అవగాహనను కేవలం ఫైనాన్స్ యాప్‌లకే పరిమితం చేయాల్సిన అవసరం లేదని ఘజియాబాద్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకుడు, ప్రొఫెసర్ అభినవ్ త్రిపాఠి అభిప్రాయపడ్డారు. రియాలిటీ షోలలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే టాస్క్‌లను చేర్చడం, డబ్బు నిర్వహణ నైపుణ్యాలను పరీక్షించే క్విజ్ పోటీలు నిర్వహించడం, ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో పాత్రల ద్వారా దీర్ఘకాలిక పొదుపు, ఖర్చులు, పెట్టుబడుల ప్రాధాన్యతను చూపించడం.. వంటి పద్ధతుల ద్వారా ప్రజలకు సులువుగా చేరువ కావచ్చని ఆయన తెలిపారు.

నేటి తరం ఇంటరాక్టివ్, విజువల్ కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్న తరుణంలో ఆర్థిక విద్య సైతం ఆ దిశగా అడుగులు వేయాలని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎవరో చెబితే వినడం కంటే, స్వయంగా అనుభవించి నేర్చుకున్నప్పుడే ఆర్థిక నిర్ణయాలపై స్పష్టత వస్తుందని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *