Headlines

అసలు ఎల్ నినో అంటే ఏంటీ..? ప్రపంచం ఎందుకింత భయపడుతుంది..!


ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేసే ఎల్ నినో మరోసారి విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎల్ నినో తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయని, ఇది వెయ్యేళ్లలోనే అత్యంత బలమైన సూపర్ ఎల్ నినోగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ వాతావరణ నిపుణుడు, ప్రొఫెసర్ మాట్ కాలిన్స్ స్పష్టం చేశారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు ప్రాంతం చల్లగా ఉంటుంది. కానీ ఎల్ నినో ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలోని సముద్ర ఉపరితల జలాలు అనూహ్యంగా వేడెక్కుతాయి. ఫలితంగా వర్షపాత గమనాలు గతితప్పి, ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తీవ్రమైన కరవులు, మరోవైపు ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. సాధారణంగా ఇది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది. అయితే మానవ తప్పిదాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తోడవ్వడంతో ఈసారి ఎల్ నినో తీవ్రత ఊహకందని స్థాయికి చేరింది.

4 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది తూర్పు పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే సగటు కంటే 3 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదైంది. గతంలో 2015లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఇది సమానం. అయితే ప్రస్తుత ఎల్ నినో ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని, ఈ ఏడాది చివరి నాటికి సగటు కంటే 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది మునుపెన్నడూ చూడని తీవ్ర విధ్వంసానికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశం సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం

ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం ఇప్పటికే మొదలైంది

భారత్: ఎల్ నినో ప్రభావంతో భారత వర్షాకాలం బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది, ఇది వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఇండోనేషియా – అమెజాన్: ఇండోనేషియాలో కార్చిచ్చులు , అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఐరోపా, బ్రిటన్: పసిఫిక్ తీర ప్రాంతాలతో పాటు బ్రిటన్ వంటి దేశాల్లోనూ చలికాలంలో అకాల, అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముంది.

శాస్త్రవేత్తల సూచన.. ముందస్తు సమాచారమే రక్షణ

గతంతో పోలిస్తే ప్రస్తుతం 6 నుంచి 9 నెలల ముందే ఎల్ నినోను అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని లాటిన్ అమెరికా, ఆసియా దేశాల రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ఆగ్నేయాసియా ప్రభుత్వాలు మౌలిక వసతులు, కార్చిచ్చుల నివారణ చర్యలను పటిష్టం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్ గ్యాసెస్ విడుదలను తగ్గించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారమని ప్రొఫెసర్ మాట్ కాలిన్స్ నొక్కి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *