అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వైపు మళ్లాయి. హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముగియనున్న కాల్పుల విరమణ గడువు వెరసి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు పాకిస్థాన్ రాజధానిలో జరగబోయే కీలక శాంతి చర్చల వైపు ఆసక్తిగా చూస్తోంది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఈ వారం ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ చర్చలు ఆశాజనకంగా సాగి, ఒప్పందానికి మార్గం సుగమం అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండటం గమనార్హం. ఆయన ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా హాజరై ఒప్పందంపై ముద్ర వేయాలని భావిస్తున్నారు. బుధవారం (ఏప్రిల్ 22) నాటికి చర్చల పురోగతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పాకిస్తానీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికా – ఇరాన్‌ల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ ఇప్పటికే తేల్చి చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా ఇటీవలే ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవడంతో ఇరాన్ చర్చల నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ తన వైఖరిని సానుకూలంగా పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం.
చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ప్రధానాంశాలపై ఏకాభిప్రాయం కుదరడం కత్తిమీద సాములా మారింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉండాలని ట్రంప్ గట్టిగా కోరుకుంటున్నారు. తన అణు కార్యక్రమానికి విఘాతం కలగకుండానే, తనపై ఉన్న కఠినమైన ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందాలని ఇరాన్ భావిస్తోంది. హోర్ముజ్ జలసంధిపై తనకున్న పట్టును చర్చల్లో అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది.
ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ చర్చల ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. బుధవారంలోపు కుదిరే ఒప్పందం యుద్ధాన్ని నివారిస్తుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..