మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల నట జీవితంలో త్రిపాత్రాభినయం చేసిన ఏకైక చిత్రం ముగ్గురు మొనగాళ్లు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రౌడీ అల్లుడు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో రావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. తొలుత ద్విపాత్రాభినయం చేయాలని భావించినప్పటికీ, మొనాటనీని నివారించేందుకు దర్శకుడు రాఘవేంద్రరావు మూడో పాత్రను చేర్చమని సలహా ఇచ్చారు. ఈ ఆలోచన చిరంజీవికి నచ్చడంతో, ఆయన తొలిసారి మూడు పాత్రలను పోషించడానికి సరేనన్నారు. కథను తయారు చేసే బాధ్యతను చిరంజీవి తన ఆస్థాన రచయిత సత్యానంద్‌కు అప్పగించారు. సత్యానంద్ ఒక ప్రాథమిక లైన్ సిద్ధం చేసిన తర్వాత, సత్యానంద్, రాఘవేంద్రరావు, చిరంజీవి కలిసి కూర్చుని కథకు తుది రూపాన్ని ఇచ్చారు.
చిత్రంలో పృథ్వి, విక్రమ్ పాత్రలు మాస్ తరహాలో ఉండటంతో చిరంజీవికి అవి కొత్తేమీ కావు. అయితే, దత్తాత్రేయ పాత్ర మాత్రం ఆయనకు పూర్తిగా విభిన్నమైనది కావడంతో, చిరంజీవి ఆ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1990ల నాటి ప్రముఖ నటీమణులు రోజా, నగ్మా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సినిమా టైటిల్ ఎంపికపై యూనిట్ సభ్యుల మధ్య పెద్ద చర్చ జరిగింది. దర్శకుడు రాఘవేంద్రరావు ముగ్గురూ ముగ్గురే లేదా ముగ్గురు మొనగాళ్లు అని సూచించారు. అయితే, నిర్మాత నాగబాబుకు ఈ రెండు టైటిల్సూ నచ్చలేదు. ఆయన అద్భుత సోదరులు లేదా ఘరానా మొనగాళ్లు అని సూచించారు. చివరికి, ఓటింగ్ నిర్వహించగా, అందరూ ముగ్గురు మొనగాళ్లు టైటిల్ కు ఓటేశారు. శోభన్ బాబు హీరోగా ఇదే టైటిల్ తో ఇదివరకే ఒక సినిమా వచ్చినప్పటికీ, కథకు తగిన టైటిల్ ఇదేనని నిర్ణయించి ఖరారు చేశారు. తొలిసారి మూడు పాత్రలు పోషిస్తుండటంతో చిరంజీవి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఒకే రోజు తల్లి పాత్రధారి శ్రీవిద్యతో సెంటిమెంట్ సన్నివేశం, మధ్యాహ్నం రోజాతో రొమాంటిక్ సన్నివేశం, రాత్రి విలన్ శరత్ సక్సేనాతో ఫైట్ సన్నివేశం వంటి విభిన్న మూడ్స్ ఉన్న మూడు పాత్రలను చిరంజీవి సమర్థవంతంగా పోషించారు.
ముగ్గురు మొనగాళ్లు సినిమా మొత్తం వర్కింగ్ డేస్ 100 కాగా, ఇందులో 30 రోజులు కేవలం క్లైమాక్స్ చిత్రీకరణకే పట్టింది. క్లైమాక్స్ కోసం చిరంజీవి 28 రోజులు పని చేశారు. పతాక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఐదు కెమెరాలను ఉపయోగించారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసినప్పుడు ఆయనకు డూప్‌గా కమెడియన్ సుధాకర్ లేదా నటుడు ప్రసాద్ బాబు నటించేవారు. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో కూడా ప్రసాద్ బాబు డూప్‌గా నటించారు. అయితే, ఈ సినిమాలో ముగ్గురు చిరంజీవులు ఒకేసారి కలుసుకునే సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు మూడో పాత్రకు డూప్‌గా ఎవరిని పెట్టాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నప్పుడు, ఆయన దృష్టి తన పక్కనే ఉన్న సుబ్బరాజు మీద పడింది. సుబ్బరాజు అప్పట్లో చిరంజీవికి వెన్నంటే ఉంటూ ఆయన వ్యక్తిగత విషయాలను చూసుకునేవారు. చిరంజీవి సుబ్బరాజును డూప్‌గా నటించమని అడిగితే, తొలుత భయపడినా, తర్వాత ధైర్యం తెచ్చుకుని నటించారు. చిరంజీవి ఎత్తు, పర్సనాలిటీ సుబ్బరాజుకు సరిపోవడంతో అది ఆయనకు కలిసొచ్చింది. తెరపై ముగ్గురు చిరంజీవులు కనిపించే సన్నివేశాలను దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆసక్తికరంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దారు.
సావిత్రి చేసిన పనికి కోపంతోనే ఆమె చివరి చూపుకు కూడా వెళ్లలేదు…