అకౌంట్‌ హోల్డర్‌తో పాటు నామినీ కూడా చనిపోతే.. బ్యాంక్‌ డబ్బు ఎవరికి ఇస్తుంది?

అకౌంట్‌ హోల్డర్‌తో పాటు నామినీ కూడా చనిపోతే.. బ్యాంక్‌ డబ్బు ఎవరికి ఇస్తుంది?


బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన డబ్బు విషయంలో చాలా మందికి ఉండే కీలక సందేహం ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ చెందుతుంది? దీనిపై RBI, బ్యాంకింగ్ చట్టాలు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించాయి. నియమాల ప్రకారం ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణించిన సందర్భంలో, ఆ డిపాజిట్ చట్టబద్ధమైన వారసులకు సంక్రమిస్తుంది. నామినీ పాత్ర కేవలం ధర్మకర్తదే తప్ప, ఆస్తి తుది యజమాని కాదు. ఈ విషయాన్ని శర్బతి దేవి వర్సెస్ ఉషా దేవి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. అంటే నామినీ కేవలం డబ్బును స్వీకరించి, అసలు వారసులకు అందించే బాధ్యత వహిస్తారు.

వారసత్వాన్ని నిర్ణయించడం రెండు మార్గాల్లో జరుగుతుంది. మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉంటే, దాని ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఒకవేళ వీలునామా లేకపోతే, హిందూ వారసత్వ చట్టం వంటి సంబంధిత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. వ్యక్తి మతానికి అనుగుణంగా ఇతర వారసత్వ చట్టాలు కూడా అమల్లో ఉంటాయి. డబ్బును క్లెయిమ్ చేయడానికి వారసులు బ్యాంకుకు దరఖాస్తు చేయాలి. ఇందుకు మరణ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా సక్సెషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలు అవసరం. అవసరమైతే బ్యాంకులు అదనపు పత్రాలను కూడా కోరవచ్చు.

ఇక ఖాతా చాలా కాలం పాటు క్లెయిమ్ చేయబడకుండా ఉంటే, RBI నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం డిపాసిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF)కు బదిలీ చేయబడుతుంది. అయితే తర్వాత కూడా అసలు వారసులు తగిన పత్రాలతో ఎప్పుడైనా డబ్బును తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీని నియమించకపోతే కూడా, ఖాతాదారుని చట్టబద్ధమైన వారసులకే ఆ నిధులు చెందుతాయి. ఉమ్మడి ఖాతాల విషయంలో, ఒక ఖాతాదారుడు మరణిస్తే, మరొక ఖాతాదారుడికి పూర్తి హక్కులు లభిస్తాయి. నిపుణుల సూచన ప్రకారం ఖాతాల్లో నామినీ వివరాలను సకాలంలో నవీకరించడం, అలాగే అవసరమైన పత్రాలను భద్రంగా ఉంచడం ద్వారా కుటుంబ సభ్యులు అనవసర ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *