Voyager 1’s “Pale Blue Dot” photograph: అంతరిక్షంలో మన భూమి ఎంత పెద్దగా కనిపిస్తుంది? మనకు తెలిసిన ఈ ప్రపంచం కోట్లాది నక్షత్రాల మధ్య ఎంత చిన్నదో ఎప్పుడైనా ఊహించారా? సరిగ్గా ఇదే విషయాన్ని ప్రపంచానికి చూపించింది నాసా పంపిన వాయేజర్ 1. భూమికి ఏకంగా 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి మన గ్రహాన్ని ఫొటో తీసింది. ఆ చిత్రంలో భూమి ఓ చిన్న నీలి చుక్కలా కనిపించింది. ఈ చారిత్రాత్మక ఫొటో తీసిన 34 నిమిషాలకే వాయేజర్ 1 కెమెరాలను శాశ్వతంగా నిలిపివేశారు. ఇంతకీ ఆ ఫొటో ఎందుకు తీశారు? కెమెరాలను ఎందుకు ఆఫ్ చేశారు?
అంతరిక్షంలో ఓ నీలి చుక్క.. అదే మన భూమి!
1990 ఫిబ్రవరి 14.. అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజు. భూమికి సుమారు 6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న వాయేజర్ 1 తన కెమెరాలను వెనక్కి తిప్పి భూమి వైపు చూసింది. అప్పుడు తీసిన ఫొటోనే ‘పేల్ బ్లూ డాట్’ (Pale Blue Dot). ఆ ఫొటోలో మన భూమి ఎంతో చిన్నగా కనిపిస్తుంది. విశాలమైన అంతరిక్షంలో సూర్యకాంతి మధ్య ఓ నీలిరంగు చుక్కలా దర్శనమిస్తుంది. ఆ ఫొటోలో భూమి పరిమాణం ఒక్క పిక్సెల్ కంటే కూడా తక్కువ. మనుషులు, దేశాలు, సముద్రాలు, పర్వతాలు.. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్న భూమి అంతరిక్షం నుంచి చూస్తే ఎంత చిన్నదో ఈ ఒక్క చిత్రం స్పష్టం చేసింది.
60 ఫొటోల్లో భూమి చిత్రమే ఎందుకు ప్రత్యేకం?
సౌర కుటుంబంలోని ఆరు గ్రహాలను చూపించేలా మొత్తం 60 చిత్రాలను తీసింది వాయేజర్ 1. ఈ చిత్రాల సమాహారానికి ‘ఫ్యామిలీ పోర్ట్రెయిట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్’ అని పేరు పెట్టారు. అయితే వీటన్నింటిలో భూమి ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే మనం నివసించే గ్రహం అంతరిక్షంలో ఎంత చిన్నదో, మన జీవితాలు ఈ విశ్వంలో ఎంత విలువైనవో ఆ చిత్రం గుర్తుచేసింది.
ఆ ఒక్క ఫొటో వెనుక కార్ల్ సగాన్ ఆలోచన!
ఈ అద్భుతమైన ఫొటో వెనుక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సగాన్ ఉన్నారు. సౌర కుటుంబం అంచుల నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తుందో ప్రపంచానికి చూపించాలని ఆయన భావించారు. ఈ ఆలోచనను అమలు చేయడానికి నాసాను ఒప్పించేందుకు చాలా కాలం ప్రయత్నించారు. చివరకు అనుమతి లభించడంతో 1990 ఫిబ్రవరి 14న వాయేజర్ 1 తన కెమెరాలను భూమి వైపు తిప్పింది. అలా చరిత్రలో నిలిచిపోయే ‘పేల్ బ్లూ డాట్’ చిత్రం ఆవిష్కృతమైంది. ఈ ఫొటో స్ఫూర్తితో కార్ల్ సగాన్ 1994లో ‘Pale Blue Dot: A Vision of the Human Future in Space’ అనే పుస్తకాన్ని రాసారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఆలోచింపచేస్తాయి. ‘మళ్లీ ఆ చిన్న చుక్కను చూడండి. అదే మనం ఉన్న చోటు.. అదే మన ఇల్లు.. అదే మనమంతా ‘.
ఫొటో తీసిన 34 నిమిషాలకే కెమెరాలకు ఎందుకు ముగింపు?
ఇక్కడే ఈ కథలో మరో ఆసక్తికర విషయం ఉంది. వాయేజర్ 1 – 1990 ఫిబ్రవరి 14న ఉదయం 4:48 GMT గంటలకు భూమి ఫొటోను తీసింది. కానీ ఆ తర్వాత కేవలం 34 నిమిషాలకే అంటే ఉదయం 5:22 గంటలకు నాసా దాని కెమెరాలను శాశ్వతంగా ఆఫ్ చేసింది. విద్యుత్ శక్తిని ఆదా చేయడం కోసం ఆఫ్ చేసింది. అప్పటికే వాయేజర్ 1 తన ప్రధాన గ్రహాల ఫొటోగ్రఫీ లక్ష్యాలను పూర్తి చేసింది. సూర్యుడికి మరింత దూరంగా వెళ్తున్న కొద్దీ దానికి అందుబాటులో ఉన్న విద్యుత్ శక్తి తగ్గుతోంది. దీంతో కెమెరాలను నిలిపివేసి, మిగిలిన శక్తిని ఇతర శాస్త్రీయ పరికరాల కోసం వినియోగించాలని నాసా నిర్ణయించింది. అయితే కెమెరాలు ఆగిపోయినా వాయేజర్ 1 ప్రయాణం ఆగలేదు. అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అంతరిక్షానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భూమికి పంపుతూనే ఉంది.
2026లో మరో అరుదైన ఘనత.. భూమికి ఒక కాంతి రోజు దూరంలో!
వాయేజర్ 1 ప్రయాణం మొదలై దాదాపు 49 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ అది ఇంకా అంతరిక్షంలో దూసుకుపోతూనే ఉంది. 2026 నవంబర్లో భూమికి ఒక కాంతి రోజు (One Light-Day) దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఒక కాంతి రోజు అంటే కాంతి 24 గంటల్లో ప్రయాణించే దూరం. ఇది సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు. అంటే భూమి నుంచి వాయేజర్ 1కు పంపే సంకేతాలు అక్కడికి చేరడానికి దాదాపు 24 గంటలు పడుతుంది. వాయేజర్ 1 నుంచి వచ్చే సమాధానం భూమికి చేరడానికి మరో 24 గంటలు పడుతుంది.
ఒక్కసారి ఆలోచించండి.. మన భూమిని ఓ చిన్న నీలి చుక్కగా ఫొటో తీసిన వాయేజర్ 1.. ఇప్పుడు భూమికి ఒక కాంతి రోజు దూరంలో ప్రయాణిస్తోంది. కెమెరాలు మూగబోయినా దాని ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంది. మన గ్రహం ఎంత చిన్నదో, మానవ అన్వేషణకు హద్దులు లేవో గుర్తుచేస్తున్న ఈ అంతరిక్ష నౌక ప్రయాణం నిజంగా అద్భుతమే!