బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి శనివారం తీరం దాటింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. అక్టోబరు 1న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై మరో అప్డేట్ ఇచ్చింది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఏపీ, తెలంగాణలో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. అంతేకాకుండా బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచనలు చేసింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
ఆదివారం ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొంది. కృష్ణానది- ప్రకాశం బ్యారేజి మొదటి హెచ్చరిక చెరువలో, గోదావరి నది- ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..