రామా రామా ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో.. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తారామాస ఉయ్యాలో.. బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో.. అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరువాడా, పల్లె పట్నం తేడా లేకుండా సాయంత్రం అయిదంటే చాలు.. మహిళలంతా ఒక్కచోట చేరి పూల బతుకమ్మను పూజిస్తూ ఆటపాటలతో సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. అది బతుమ్మ ఆటలో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది అంటున్నారు నెటిజన్లు.
బతుకమ్మ.. ప్రకృతిని ఆరాధించే పూల పండుగ బతుకమ్మ.. పితృ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అంటే సుమారు 15రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ వేడుకల్ని సంబురంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వివిధ పేర్లు, రూపాలలో కొలుచుకుంటారు. తొమ్మిది రోజుల పాటు సాయంత్రం వేళ తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఇంటిముందు పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే, ఈ యేడు బతుకమ్మ రోజుల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఏకధాటిగా కురుస్తున్న వానలతో బతుకమ్మ ఆడేందుకు మహిళలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం కొందరు మహిళలు వర్షం వచ్చినా లెక్కచేయకుండా వానకు తగిన దరువు, స్టెప్పులతో ఆడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఈ వీడియో ఎక్కడ తీశారు..ఏంటీ అనే వివరాలు తెలియదు గానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జోరువానలో మహిళలంతా బతుకమ్మ ఆడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వాకిట్లో బతుకమ్మను ఏర్పాటు చేసుకున్న మహిళలు రంగు రంగుల గొడుగులు పట్టుకుని తమదైన స్టైల్లో ఓ రిథమిగ్గా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు.. వానపడని, పిడుగులు పడని మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టుగా వానలోనే ధూమ్‌దామ్‌గా బతుకమ్మ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇకపోతే, బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఐదు రోజుల తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. అలిగిన బతుకమ్మ వెనుక కూడా దేవీభాగవతం ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది.