అది విశాఖ రైల్వే స్టేషన్.. రైళ్లు వస్తూపోతూ ఉన్నాయి.. ప్లాట్ ఫామ్స్ అన్నీ బిజీబిజీగా ప్రయాణికులతో కనిపిస్తున్నాయి.. ఇంతలో ఒకటే అలజడి.. ఓ ముగ్గురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు.. పిలిచి ప్రశ్నిస్తే తడబడ్డారు.. వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే.. నోట్ల కట్టలు కనిపించాయ్.
సాధారణ తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీస్- జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ – ఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అన్ని ప్లాట్ ఫామ్‌లపై నిఘా పెంచి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. వారి లగేజీలు చెక్ చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులతో ప్లాట్‌ఫామ్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. రైళ్లు వస్తూపోతూ హడావిడిగా ఉంది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు.. విశాఖ మీదుగా ఒడిశా కంఠాబంజికు వెళ్తున్నారు. ఏదో అనుమానస్పదంగా ఉన్నారు. పిలిచి వాళ్ల ముగ్గురుని విచారిస్తే తడబడ్డారు. బ్యాగుల్లో ఏమున్నాయి అని ప్రశ్నిస్తే బిత్తర చూపులు చూశారు. దీంతో తనిఖీలు చేశారు రైల్వే పోలీసులు. నోట్ల కట్టలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అన్ని 500 రూపాయల నోట్లే.. కొన్ని మాత్రం 200 రూపాయల కట్టలు. అన్ని కలిపి లెక్కిస్తే 43 లక్షలు…! వాళ్ళను ప్రశ్నిస్తే.. తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళుగా తేలింది. నగదును తెలంగాణలో తమ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీల కోసమని చెప్పుకొచ్చారు. వారికి అడ్వాన్స్ ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు వివరణ ఇచ్చారు. లెక్కా పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. వారితోపాటు, స్వాధీనం చేసుకున్న నగదును మహారాణిపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచినట్లు పోలీసులు తెలిపారు.