కాసేపు కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తేనే కుదురుగా ఉండలేం.. చిన్న నొప్పికే కుయ్యో మొర్రో అంటూ అల్లాడిపోతాం.. ఆ బాధ తగ్గేవరకు ప్రతి క్షణం నరకం చూస్తాం.. అలాంటిది.. ఇక్కడ ఓ వ్యక్తి కడుపులో నుంచి 49 స్టీల్ చెంచాలు, టూత్ బ్రష్‌లు బయటపడ్డాయి.. ఇది వినడానికే భయంకరంగా ఉంది కదూ.. అయినా అన్ని స్టీల్ చెంచాలు.. కడుపులోకి ఎలా వెళ్లాయనేదే ఇక్కడ ముందుగా మనకు తలెత్తే ప్రశ్న.. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో జరిగింది. బులంద్‌షహర్‌కు చెందిన 40 ఏళ్ల సచిన్ మత్తు అలవాటు వల్ల కుటుంబ సభ్యులు అతడిని నషా విముక్తి కేంద్రం (De-addiction Centre)లో చేర్పించారు. అతనిని ఒంటరిగా అక్కడ వదిలేసి వెళ్లారన్న కోపంతో సచిన్.. స్టీల్ చెంచాలు, టూత్ బ్రష్‌లు, పెన్ తినడం ప్రారంభించాడు.
ఎవరైనా కోపం వస్తే గట్టిగట్టిగా అరుస్తారు.. లేదా కోపాన్ని దాని పక్క వాళ్ళ మీద చూపిస్తారు. ఇదేంటి ఈయన ఇలా స్టీల్ వస్తువులు తినేస్తున్నాడని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అది అలాగే కొనసాగడంతో అతని ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అప్పటికే చాలా రోజులుగా అలా చేస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి హాపూర్‌లోని దేవనందిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు డా.శ్యామ్ కుమార్ ఎక్స్‌రే తీసి చూసినప్పుడు కడుపులో భారీగా మెటల్ వస్తువులు కనిపించాయి. ఇంకేముంది.. వైద్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అలాంటి ఒక కేసును చూసేసరికి షాక్ అవ్వడం డాక్టర్ వంతయింది. వెంటనే వైద్య బృందం శస్త్రచికిత్స చేసి అతని కడుపులో నుంచి 29 స్టీల్ చెంచాలు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్‌లు బయటకు తీశారు.
వీడియో చూడండి..
ఈ ఘటనపై డా. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. రోగిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతను నషా విముక్తి కేంద్రంలో చెంచాలు, టూత్ బ్రష్‌లు తినేవాడని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత మొత్తం వస్తువులు బయటకు తీశాం. ఈ సమస్య సాధారణంగా మానసిక సమస్యలున్నవారిలో కనిపిస్తుంది. రోగి కడుపులో నుంచి 49 స్టీల్ చెంచాలు, టూత్ బ్రష్‌లు బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడు.. ఇంటికి పంపించాం’ అని తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసినవారు సైతం ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, అయినా స్టీల్ వస్తువులు తిని మనిషి ఎలా ఉండగలిగాడని ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..