మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన శుభమ్ నిమానా అనే 7 ఏళ్ల బాలుడు గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. సదరు రోగి కుటుంబ సభ్యులు.. అతడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 2 లక్షలు ఖర్చు చేసి మరీ చికిత్స చేయించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి అతడ్ని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసి.. CT స్కాన్, ఎండోస్కోపీ చేయగా.. అతడి కడుపు, చిన్న ప్రేగులో అసాధారణమైన ఆకారం ఒకటి ముద్దలా పేరుకుపోయి ఉందని వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ట్రైకోబెజోవర్ అనే వ్యాధి కాగా.. ఆ 7 ఏళ్ల బాలుడి కడుపులో హెయిర్ బాల్, గడ్డి, షూలేస్ దారాలు పేరుకుపోయాయని డాక్టర్లు కనుగొన్నారు.
డాక్టర్ రామ్‌జీ నేతృత్వంలోని వైద్యులు బాలుడి కడుపులో పేరుకుపోయిన ఆ ముద్దను లాపరోటమీ ద్వారా తొలగించారు. ఆపరేషన్ అనంతరం ఆరు రోజుల పాటు శుభమ్‌కు ద్రవ పదార్ధాలు మాత్రమే ఇచ్చారు. ఏడో రోజున అతడి కడుపులో పేరుకుపోయిన ఆ ముద్ద పూర్తిగా తోలిగిపోయిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం మానసిక నిపుణుల ద్వారా బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా, డాక్టర్ మాట్లాడుతూ.. ‘పిల్లలలో ట్రైకోబెజోవర్లు చాలా అరుదు, కేవలం 0.3-0.5 శాతం మందిలో మాత్రమే కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలలో ఏదైనా అసాధారణమైన ప్రవర్తనలను చూస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని అన్నారు.