
చిన్నపిల్లలు తమకు దొరికిన చిన్నపాటి వస్తువులతో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కాయిన్స్, బొమ్మలు, రబ్బర్లు.. ఇలా ఏవి దొరికితే వాటితో ఆడతారు. అందుకే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఓ కన్నేసి ఉంచాలి. అయితే ఇక్కడొక పదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. రబ్బర్ బాటిల్ మూత లాంటి వస్తువును మింగేశాడు. ఇక ఆ బాలుడు చిన్నతనం నుంచి ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ రబ్బర్ బాటిల్ మూత మింగిన రోజు నుంచి సదరు బాలుడికి ఆగకుండా వాంతులు వస్తుండటమే కాదు.. తీవ్రమైన కడుపునొప్పితో కూడా బాధపడ్డాడు. దీంతో కంగారుబడిన బాలుడి కుటుంబసభ్యులు.. హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు అతడికి ఎక్స్‌రే తీయగా.. కడుపులో ఏదో వింత వస్తువు ఉన్నట్టు.. అలాగే అందులో ద్రవం ఉందని గుర్తించారు. ఆపై అది సరిగ్గా చిన్న ప్రేగు మధ్య భాగంలో చిక్కుకున్నట్టు కనుగొన్నారు. అత్యవసర లాపరోస్కోపీ ద్వారా ఆ వస్తువు శరీరంలో సరిగ్గా ఇరుక్కున్న ప్రదేశాన్ని కనిపెట్టారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించి కుట్లు వేశారు డాక్టర్లు. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకోగా.. ఆ బాలుడు ఆపరేషన్ అనంతరం ఐదు రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత మానసిక నిపుణుల పర్యవేక్షణలో కొద్దిరోజులు ఉన్నాడు.