ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కల ప్రాముఖ్యత, ప్రభావాలను వాస్తు శాస్త్రం ప్రస్తావిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మనిషి జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకుని వస్తే.. మరికొన్ని మొక్కలు జీవితాన్ని దుఃఖంలో ముంచెత్తుతాయని నమ్ముతారు. ఈ నేపధ్యంలో ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టు పెంచుకునే విషయంలో వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే..
హిందూ మతంలో కొబ్బరి చెట్టుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని 'కల్పవృక్షం' అని అంటారు. అంటే కోరికలు తీర్చే చెట్టు అని కొబ్బరి చెట్టుని పిలుస్తారు. శ్రీఫలం అని పిలువబడే కొబ్బరికాయలను హిందూ మతంలో పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. అలాగే పురాణాల ప్రకారం, కొబ్బరి చెట్టులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు.
ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంటి బయట కొబ్బరి చెట్టు నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి చెట్టు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇంటిలో సానుకూల శక్తిని నింపుతుంది.
అయితే కొబ్బరి చెట్టుని ఇంటి ముందుకి బదులుగా… దానిని ఇంటి దక్షిణ, పశ్చిమ, నైరుతి లేదా ఆగ్నేయ దిశల్లో నాటండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొబ్బరి చెట్టు నీడ ఇంటిపై పడకుండా ఉండేలా నాటుకోవాలి.
మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటే, కొబ్బరి చెట్టును నాటడం వల్ల అటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కొబ్బరి చెట్టు నాటడం వల్ల వ్యాపారం, ఉపాధిలో విజయం లభిస్తుంది.