భారత ప్రభుత్వం, రైల్వే శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైళ్లు ఆరంభించిన కొత్తలో టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినా.. ప్రయాణికులు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మిగతా ట్రైన్లతో పోలీస్లే త్వరగా గమ్యస్థానలకు చేరుతుండటంతో వందే భారత్‌కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ కొత్త సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. నాగ్‌పూర్‌కు సర్వీస్ తర్వాత హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు ఇది మూడవ వందే భారత్ కనెక్షన్ అవుతుంది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు మార్గాలను జోడించడం వలన తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం, ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్-పుణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. శతాబ్ది ప్రస్తుతం దాదాపు ఎనిమిదిన్నర గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, వారానికి ఆరు రోజులు (మంగళవారాలు తప్ప) పరిమిత స్టాప్‌లు, రెండు AC ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, తొమ్మిది AC చైర్ కార్లు, రెండు EOG కార్లతో నడుస్తుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లకు అధిక ప్రజాదరణ లభించడంతో, ఇవి నిరంతరం అధిక ఆక్యుపెన్సీ స్థాయిలతో నడుస్తాయి. ఈ విజయంతో రైల్వే శాఖ సికింద్రాబాద్ నుండి మరో రెండు వందే భారత్ సేవలకు ప్రతిపాదనలు రూపొందించాయి, దీంతో వంద భారత్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది స్పష్టం చేస్తోంది. “ఈ రెండు కొత్త రైళ్ల చేరికతో, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏడు వందే భారత్ సర్వీసులను నడుపుతోంది, ఈ స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న జోన్లలో ఒకటిగా నిలుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక నెలలోపు ప్రారంభం కానుంది.” అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి