USA: H1B వీసా పేరుతో ట్రంప్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారా?

USA: H1B వీసా పేరుతో ట్రంప్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారా?


భారతీయులపై ట్రంప్‌ పేల్చిన H1B వీసా బాంబు ఖరీదు కోటి రూపాయలే కావచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చిన పాపానికి భవిష్యత్తులో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోనుందా? ట్రంప్ తీసుకున్న షాకింగ్‌ డెసిషన్‌, ఫ్యూచర్‌లో అమెరికాకే షాక్‌ ఇవ్వనుందా? అవుననే అంటున్నారు ఆర్థిక వ్యవహారాల నిపుణులు.

అమెరికాపై తీవ్ర ప్రభావం

ఈ నెల 21 నుంచి H1B వీసా కావాలంటే అక్షరాలా కోటి రూపాయలు చెల్లించాల్సిందే. H1B వీసా తెచ్చుకుని అమెరికా వెళ్లాలంటే ఐటీ నిపుణులైనా, డాక్టర్లైనా, ఏ రంగానికి చెందిన నిపుణులైనా కోటి రూపాయలు వదిలించుకోవాల్సిందే. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా తీవ్ర ప్రభావం చూపించనుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీలు, స్కూళ్లు, హాస్పిటల్స్‌తో పాటు, అక్కడి రియల్‌ ఎస్టేట్‌పైనా తీవ్ర ప్రభావం ఉంటుందని లెక్కలు కడుతున్నారు ఫైనాన్షియల్‌ పండిట్స్‌. ట్రంప్‌ ఎఫెక్ట్‌తో స్టార్టప్‌లు, చిన్న కంపెనీలు అమెరికా నుంచి వెళ్లిపోయే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం H1B వీసాపై అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెకీలు పనిచేస్తున్నారు. H1B వీసాకి లక్ష డాలర్ల ఫీజు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్.

అమెరికన్లకు స్కిల్స్‌ తక్కువ

ట్రంప్‌ చెప్పిన దాని ప్రకారం టెక్‌ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని అనుకున్నా.. ఇప్పటికిప్పుడు అమెరికన్లకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవసరం. అందుకు 10 నుంచి 15 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అమెరికన్లలో క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్లు తక్కువ ఉండడం టెక్‌ కంపెనీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జాబ్‌ను అమెరికన్లు సీరియస్‌గా తీసుకోరు. ఇక్కడ కాకపోతే ఇంకోచోట అనే విధంగా వాళ్ల తీరు ఉంటుంది. ఇక H1B వీసా ఫీజు విషయంలో ట్రంప్‌ నిర్ణయంపై కోర్టులో టెక్‌ కంపెనీలు పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. టెక్‌ కంపెనీలు H1B వీసాలు తగ్గించుకుంటూ మన దగ్గరే ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా లేకపోలేదు. అది అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు మరింత గండి కొడుతుందని చెబుతున్నారు.

అమెరికాలో ఆవిష్కరణలకు స్వస్తి

ట్రంప్‌ నిర్ణయంపై నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్ స్పందించారు. ఆ చర్య అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజు యూఎస్‌ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుంది. భారతదేశాన్ని టర్బోఛార్జ్‌ చేస్తుంది. ప్రపంచస్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్‌, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, గురుగ్రామ్‌కు వచ్చేస్తాయి. దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వస్తారు. వికసిత్‌ భారత్ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది. అమెరికాకు నష్టం కలిగించే ఈ నిర్ణయం భారత్‌కు లాభం చేకూర్చనుంది’’ అని అమితాబ్‌కాంత్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

విదేశాలపై ఆధారపడడమే మన ప్రధాన శత్రువన్న మోదీ

ఇక ట్రంప్‌ పేల్చిన H1B వీసా బాంబుపై ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్‌ చేశారు. . మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని మోదీ వ్యాఖ్యానించారు. హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

H1B వీసా ఫీజును కోటి రూపాయలు చేయడం ద్వారా, ప్రతిభకు, నైపుణ్యానికి ట్రంప్‌ డోర్లు క్లోజ్‌ చేశారని, అది భవిష్యత్తులో అమెరికాకు సెల్ప్‌గోల్‌గా మారనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *