TVK Vijay Rally Stampede: తొక్కిసలాట ఘటనలో 38కి చేరిన మృతుల సంఖ్య.. విజయ్‌ అరెస్ట్‌పై స్టాలిన్ ఏమన్నారంటే..

TVK Vijay Rally Stampede: తొక్కిసలాట ఘటనలో 38కి చేరిన మృతుల సంఖ్య.. విజయ్‌ అరెస్ట్‌పై స్టాలిన్ ఏమన్నారంటే..


తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. మరికొందర్ని పోలీసులు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. మరో 46 మందికిపైగా గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్‌ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్‌.. ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. కొంతమందికి విజయ్‌ స్వయంగా వాటర్‌ బాటిల్స్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత చేయి దాటి.. భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితులతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. భారీ జన సమూహంలో అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.

నా హృదయం ముక్కలైంది: విజయ్‌ ట్వీట్‌

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై విజయ్‌ ట్వీట్‌ చేశారు. తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయానని.. ఈ బాధ భరించలేనిది.. వర్ణించలేనిది అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విజయ్‌ ప్రకటించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్టాలిన్.. రిటైర్డ్‌ జడ్జి అరుణ జగదీశన్‌ నేతృత్వంలో కమిటీ

కరూర్‌ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఘటనాస్థలంలో తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా.. నేరుగా కరూర్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు సీఎం స్టాలిన్. అటు.. ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌ అయింది. రిటైర్డ్‌ జడ్జి అరుణ జగదీశన్‌ నేతృత్వంలో ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. అటు.. ర్యాలీకి పర్మిషన్‌ తీసుకున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్‌ని అరెస్ట్ చేస్తారా లేదా..? స్టాలిన్ ఏమన్నారంటే..

తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూర్‌కు చేరుకున్న సీఎం స్టాలిన్.. ప్రమాదంపై అధికారులతో ఆరా తీశారు. హాస్పిటల్‌లో బాధితులతో మాట్లాడిన సీఎం స్టాలిన్.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదన్నారు సీఎం స్టాలిన్ .. బాధితులకు సాయమందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలుంటాయన్నారు. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు తాను మాట్లాడను అని స్టాలిన్ స్పష్టం చేశారు.

ఇక.. కరూర్‌ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరం అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు ద్రౌపది ముర్ము. కరూర్‌ ఘోర విషాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోదీ. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *