Traffic Signals: ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కనిపించే MNL, VAC, ATC… వీటి అర్థమెంటో మీకు తెలుసా..?

Traffic Signals: ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కనిపించే MNL, VAC, ATC… వీటి అర్థమెంటో మీకు తెలుసా..?


మనం సాధారణంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్, గ్రీన్, ఎల్లో సిగ్నళ్లను చూస్తుంటాం. అప్పుడప్పుడు సిగ్నల్స్ వద్ద VAC, MNL, ATC” అనే అక్షరాలు కూడా దర్శనమిస్తుంటాయి. వాటిని మనం గమనిస్తుంటాం. కానీ, చాలా మంది వీటి అర్థం మాత్రం తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా రోజు రోజుకు భారీ సంఖ్యలో వాహనాలు పెరిగిపోతున్నాయి. దేశంలోని హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రహదారులపై ప్రయాణిస్తుంటాయి. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి.. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు గంటల సమయం పడుతుంది. అయితే, ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రధాన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. ఇవి కేవలం వాహనాల రాకపోకలను నియంత్రించడమే కాదు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ట్రాఫిక్ నియమాల ప్రకారం సిగ్నల్ సంకేతాలు:

రెడ్ సిగ్నల్ – ఆగాలి
ఎల్లో సిగ్నల్ – సిద్ధంగా ఉండాలి
గ్రీన్ సిగ్నల్ – ముందుకు సాగాలి

ఈ నియమాలు అందరికీ తెలిసినవే. అయితే, సిగ్నల్ లైట్లపై చిన్న డిస్‌ప్లేలో కనిపించే “VAC, MNL, ATC” వంటి అక్షరాలు చాలా మందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి, ఈ టెక్నికల్ కోడ్స్ సిగ్నల్ ఎలా పనిచేస్తుందో తెలియజేస్తాయి. ట్రాఫిక్ అధికారులు చెబుతున్నట్లుగా, ఈ కోడ్స్ ద్వారా సిగ్నల్ ఆపరేషన్ విధానం అర్థమవుతుంది.

ఇప్పుడు వాటి అర్థాలు, ప్రయోజనాలు ఏమిటో చూద్దాం:

MNL (Manual Mode)

  • MNL అంటే “మ్యాన్యువల్”. ఈ మోడ్‌లో సిగ్నల్‌ను ట్రాఫిక్ పోలీసులు స్వయంగా నియంత్రిస్తారు.
  • రద్దీ స్థితిని బట్టి సిగ్నల్ టైమింగ్‌ను వారు మార్చగలరు.
  • పండుగలు, భారీ ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు, వీఐపీల రాకపోకలు, నిరసనలు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరం.
  • అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఈ విధానం సహాయపడుతుంది.
  • అయితే, ఈ మోడ్ సజావుగా పనిచేయాలంటే నిరంతర మానవ పర్యవేక్షణ అవసరం.

VAC (Vehicle Actuated Control)

  • VAC అంటే “వెహికల్ ఆక్చువేటెడ్ కంట్రోల్”. ఇది సాంకేతిక ఆధారిత ఆధునిక ట్రాఫిక్ నియంత్రణ విధానం.
  • జంక్షన్ వద్ద ఉన్న సెన్సార్లు లేదా కెమెరాలు వాహనాల సంఖ్యను గుర్తిస్తాయి.
  • ఏ దిశలో ఎక్కువ వాహనాలు ఉన్నాయో దాని ఆధారంగా గ్రీన్ సిగ్నల్ సమయం మారుతుంది.
  • ఒక వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ దిశకు ఎక్కువ సమయం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
  • తక్కువ వాహనాలు ఉన్న వైపుకు తక్కువ సమయం కేటాయిస్తుంది.
  • దీంతో అనవసరంగా వాహనాలు ఆగకుండా, ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఇంధన వినియోగం, కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ATC (Area Traffic Control)

  • ATC అంటే “ఏరియా ట్రాఫిక్ కంట్రోల్”.  ఒక ప్రాంతంలోని అనేక సిగ్నళ్లను ఒక కేంద్ర వ్యవస్థ ద్వారా నియంత్రించే విధానం.
  • ట్రాఫిక్ డేటాను సేకరించి, మొత్తం ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని సమన్వయం చేస్తుంది.
  • ప్రధాన నగరాల్లో రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ఇది కీలకంగా మారింది.

ట్రాఫిక్ సిగ్నళ్లపై కనిపించే ఈ చిన్న కోడ్స్ సాధారణంగా కనిపించినా, వాటి వెనుక ఉన్న సాంకేతికత చాలా కీలకం. MNL, VAC, ATC వంటి విధానాలు నగర ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుంటే, ఇలాంటి స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత అవసరంగా మారనున్నాయి. మనమూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ఈ వ్యవస్థలు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరుస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *